Jagan Offers Vasireddy Padma as Andhra Pradesh Commission for Womenముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై ఎవరికి ఎటువంటి అభిప్రాయమైనా ఉండవొచ్చు. అయితే నమ్ముకున్న వారి బాగోగులు చూసుకోవడంలో జగన్ టాప్ అనే చెప్పుకోవాలి. ఆయన వ్యతిరేకులు కూడా ఆ విషయాన్ని ఒప్పుకుంటారు. అధికారంలోకి వచ్చిన నాటి నుండి వేగంగా నామినేటెడ్ పదవులు ఫిల్ చేస్తున్నారు. ఎన్నికలలో పోటీ చెయ్యని వారిని, చేసే అవకాశం లేని వారికి నామినేటెడ్ పదవులు కట్టబెడుతున్నారు. తాజాగా మరో భర్తీ జరిగింది.

ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా వాసిరెడ్డి పద్మను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. జగన్ సొంతంగా పార్టీ పెట్టిన నాటి నుండి ఆమె పార్టీనే నమ్ముకుని ఉన్నారు. ప్రెస్ మీట్లలో పార్టీ వాణిని బలంగా వినిపిస్తూ వచ్చారు. 2014 ఓటమి తరువాత కూడా ఆవిడ జగన్ వెంటే ఉన్నారు. దీనితో ఆమె కష్టాన్ని జగన్ గుర్తించినట్టు అయ్యింది. ఐదేళ్ళ పాటు మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా వాసిరెడ్డి పద్మ కొనసాగనున్నారు.

టీడీపీ ప్రభుత్వ హయాంలో మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా ఉన్న నన్నపనేని రాజకుమారి బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. ఆమె చాలా కాలం తన పదవికి రాజీనామా చెయ్యకపోవడంతో ఈ నియామకం ఆలస్యం అయ్యింది. అయితే నన్నపనేని తన రాజీనామా లేఖను నిన్న గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు అందజేశారు. ఆయన ఆ వెంటనే దానిని ఆమోదించారు. ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా ఆమెకు ప్రభుత్వం కేబినెట్ హోదా కలిపించే అవకాశం కూడా ఉందట.