సమైక్య రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు పంపి ఆమోదించవలసిందిగా కోరారు. ఆయన బిజెపిలో చేరేందుకు పార్టీకి రాజీనామా చేసిన్నట్లు సమాచారం.
నిజానికి ఆయన రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ అధిష్టానాన్ని ధిక్కరించిన్నప్పుడే పార్టీ నుంచి బహిష్కరించి ఉండాలి. కానీ రాష్ట్ర విభజనతో ఏపీలో పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని ముందే కాంగ్రెస్ అధిష్టానం గ్రహించినందున, లోపాయికారిగా ఆయనతో రాష్ట్ర విభజనని వ్యతిరేకిస్తూ పోరాటం చేయించింది. సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర విభజనలో కేంద్ర ప్రభుత్వానికి ఓ పక్క అన్నివిదాల సహాయసహకారాలు అందిస్తూనే, మరోపక్క ఈ భూటకపు పోరాటలతో ‘సమైక్యవీరుడు’గా ప్రజాధారణ సంపాదించుకొంటే ఆయన సాయంతో ఏపీలో కాంగ్రెస్ పార్టీని మళ్ళీ బ్రతికించుకోవచ్చని కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే రాష్ట్రావిభజనని ఆయన అంత తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించలేదు.
ఆ తర్వాత బహుశః కాంగ్రెస్ వ్యూహంలో భాగంగానే కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంద్ర పార్టీని స్థాపించి ఏపీ శాసనసభ ఎన్నికలలో తన పార్టీ అభ్యర్ధులను బరిలో దింపి పోటీ చేయించారు. రాష్ట్రం విడిపోతుందని ఖచ్చితంగా తెలిసి ఉన్నా ఆయన కూడా జగన్మోహన్ రెడ్డిలాగా ఉత్తుత్తి సమైక్యాంద్ర ఉద్యమాలు చేసి ‘సమైక్య ఛాంపియన్’ అయ్యేందుకు ప్రయత్నించారు. కానీ వారిద్దరూ భూటక ఉద్యమాలు చేస్తూ తమని మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆంధ్రా ప్రజలు బాగానే గ్రహించారు. అందుకే ఇద్దరినీ ఆ ఎన్నికలలో తిరస్కరించారు.
ఈ విషయం ముందే పసిగట్టిన కిరణ్ కుమార్ రెడ్డి చివరి నిమిషంలో ఎన్నికలలో పోటీ చేయకుండా ఉండిపోయారు. కాంగ్రెస్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసినప్పుడే ఆయనను పార్టీ నుంచి బహిష్కరించి ఉండాలి. కానీ ఆయన పార్టీ కోసమే ఆవిదంగా నటించారు కనుక బహిష్కరించలేదు!
ఆ తర్వాత ఆయన సమైక్యాంధ్ర పార్టీ స్థాపించినప్పుడే వేరే పార్టీ వారయ్యారు. కానీ అది కూడా కాంగ్రెస్ వ్యూహంలో భాగమే కనుక బహిష్కరించలేదు!
ఏపీలో ఎలాగూ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఏపీలో బిజెపికి ఆయన వంటి ఓ బలమైన నాయకుడు అవసరం ఉంది. అయితే బిజెపిలో చేరేందుకు కాంగ్రెస్ సభ్యత్వం అడ్డు కనుక ఇన్నేళ్ళ తర్వాత ఆయన రాజీనామా చేసి కాషాయ కండువా కప్పుకొని ప్రజల ముందుకు రాబోతున్నట్లున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజల అభీష్టానికి విరుద్దంగా వ్యవహరించిన కాంగ్రెస్ నేతలందరినీ ఓ ‘సమైక్యవాది’ జగన్మోహన్ రెడ్డి ఆదరించి మంత్రి పదవులు ఇవ్వగా, మరో సమైక్యవాది కిరణ్ కుమార్ రెడ్డి మిగిలినవారిని బిజెపిలోకి తీసుకువస్తారేమో?