Jagan - Ram Gopal Varma-RGVసినిమా టికెట్ ధరలపై తన గళాన్ని ఎత్తి వైసీపీ సర్కార్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తోన్న రాంగోపాల్ వర్మ, గత కొన్ని రోజులుగా మీడియాలలో ఓ స్థాయిలో హల్చల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ కార్యక్రమంలో కూడా పాల్గొనగా, తాజాగా దానికి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేసారు.

వైసీపీకి అనుయాయుడిగా ఉన్న వర్మ, గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బాబుకు వ్యతిరేకంగా “లక్ష్మీస్ ఎన్టీఆర్” సినిమాను తీసి రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. మరి ఇపుడు వైసీపీ సర్కార్ పై అనేక ప్రశ్నలు వేస్తోన్న వర్మ, అలాంటి సినిమానే జగన్ మీద తీయగలరా? అంటూ ఆర్కే ప్రశ్నించారు.

వీటితో పాటు మరో రెండు లైన్స్ కూడా ఆర్కే ప్రస్తావించారు. ఇటీవల వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజును అరెస్ట్ చేసిన సమయంలో, రెండు కాళ్ళను తీవ్రంగా కొట్టిన దానిపై సినిమా తీస్తారా అని అడుగగా, ఆ కొట్టడానికి ముందు, వెనుక ఏం జరిగిందో తెలియదు, అందులో రెండు గంటలు సినిమా తీసే కంటెంట్ లేదని అన్నారు వర్మ.

మరొక లైన్ వివేకానంద రెడ్డి హత్య ఉదంతం అని ప్రస్తావించగా, వర్మ ఫోన్ చూసుకుంటూ ఉన్న సన్నివేశాన్ని కట్ చేసారు. అలాగే వర్మలో లౌక్యమే కాదు పిరికితనం ఉందంటూ కట్ చేసిన ప్రోమో ప్రేక్షకులలో ఆసక్తిని పెంచుతోంది. వర్తమాన విషయాలపై ప్రస్తావించి మీడియా అటెన్షన్ ను తన వైపుకు తిప్పుకోవడంలో వర్మకు సాటి మరొకరు ఉంటారా?!