YS-Jagan--Mohan-Reddy High Court Caseజగన్ అక్రమాస్తుల కేసులు సీబీఐ కోర్టులో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రిగా విధులు నిర్వహిస్తున్నందున ఈ విచారణకు జగన్ మోహన్ రెడ్డికి వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ జగన్ తరపు న్యాయవాదులు చేసిన విజ్ఞప్తిని సీబీఐ కోర్టు కొట్టివేసి, ఖచ్చితంగా హాజరు కావాలని ఇప్పటికే స్పష్టం చేసింది.

దీంతో జగన్ తరపు న్యాయవాదులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి వారానికి అయిదు రోజుల పాటు విచారణకు హాజరైతే, ఆ రాష్ట్రంలో అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుందని, అలాగే పరిపాలనకు ఇబ్బందులు కలుగుతాయని జగన్ తరపు న్యాయవాది ఎస్.నిరంజన్ రెడ్డి తమ వాదనలు వినిపించారు.

అలాగే ప్రోటోకాల్ ప్రకారం భద్రతా పరమైన సమస్యలు కూడా ఉంటాయని, 2జీ కేసు కన్నా అయిదు రెట్లు సంక్లిష్టంగా జగన్ పై కేసులు ఉన్నాయని, సీబీఐ మరియు ఈడీలు కలిసి 20 ఛార్జ్ షీట్స్ దాఖలు చేసారని, దీని వలన విచారణకు ఎక్కువ సమయం పడుతుందని, ప్రతిసారి విచారణకు హాజరు కావడం ఒక ముఖ్యమంత్రికి సాధ్యం కాదని జగన్ తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించుకున్నారు.

ముఖ్యమంత్రిగా లేనపుడు జగన్ ప్రతి వారం విచారణకు హాజరయ్యారని, కేవలం కొన్ని సందర్భాలలో మాత్రమే హాజరు కాలేనని కోర్టు నుండి అనుమతులు తీసుకున్నారని, ప్రజా విధుల్లో ఉన్న వారిని ఇబ్బంది పెట్టరాదని గతంలో పలు కేసుల్లో హైకోర్టు, సుప్రీంకోర్ట్ ఇచ్చిన తీర్పులను ఈ సందర్భంగా ప్రస్తావించారు.

జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నేతృత్వంలో తెలంగాణ హైకోర్టులో జరిగిన ఈ విచారణలో జగన్ తరపు న్యాయవాది వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ మాజీ ప్రధాని పీవీ నరసింహారావుపై ఉన్న ఝార్ఖండ్ ముక్తి మోర్చా కేసుల్లో ఎన్నిసార్లు హాజరయ్యారని ఆరా తీశారు. అనంతరం ఈ విచారణలో సీబీఐ వాదనలు వినేందుకు డిసెంబర్ 6వ తేదీకి వాయిదా వేశారు.