AP Chief Minister Jagan-Mohan-Reddyసుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో తెలంగాణ సిఎం కేసీఆర్‌ చాలా బలమైన స్నేహ సంబంధాలు కొనసాగిస్తుంటే, సిఎం జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు, హైకోర్టుల చేత నిత్యం ఏదో అంశంపై మొట్టికాయలు వేయించుకొంటుండటం విశేషం.

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు మారుతున్నా కొత్తగా వస్తున్నవారు కూడా మూడు రాజధానులకు వేసిన బ్రేకులు నొక్కి పడుతూనే ఉన్నారు. పైగా అమరావతిలోనే నిర్మాణాలు కొనసాగించక తప్పనిసరి చేశారు. దీంతో జగన్ అడుగు ముందుకు వేయలేకపోతున్నారు. వివాదాస్పద నిర్ణయాలు తీసుకొని మొండిగా అమలు చేయాలనుకోవడం ఒక కారణమైతే, కోర్టులను కూడా లెక్క చేయకపోయడం మరో కారణంగా చెప్పక తప్పదు. హైకోర్టు జడ్జీలను, వారి తీర్పులను సైతం వైసీపీ మంత్రులు విమర్శించడమే ఓ మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

అయితే ఇప్పుడు తత్వం బోధపడినట్లుంది… అందుకే సిఎం జగన్మోహన్ రెడ్డి సోమవారం సాయంత్రం ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్‌ను విజయవాడ ప్రభుత్వ గెస్ట్ హౌసులో ప్రత్యేకంగా కలువనున్నారు. గతంలో వివిద వేదికలపై ఆయనను కలిసినప్పటికీ ప్రభుత్వ గెస్ట్ హౌసులో దిగిన జస్టిస్ ప్రశాంత్ కుమార్‌ వద్దకు సిఎం జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ప్రత్యేకంగా కలవడం ఇదే తొలిసారి.

జస్టిస్ ప్రశాంత్ కుమార్‌ మూడు రాజధానులకు బ్రేక్ వేసి అమరావతిలో నిర్మాణాలు మొదలుపెట్టాలని తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. కనుక సిఎం జగన్మోహన్ రెడ్డి ఆయనను ప్రసన్నం చేసుకొని ప్రభుత్వానికి సహకరించవలసిందిగా కోరేందుకే వెళుతున్నారేమో?కానీ వివాదాస్పద నిర్ణయాలను ఆయన మాత్రం ఎలా అంగీకరిస్తారు? ఎలా సహకరిస్తారు?

మూడు రాజధానుల వంటి వివాదాస్పద నిర్ణయాల వలన వ్యక్తిగతంగా సిఎం జగన్మోహన్ రెడ్డికి, వైసీపీకి (ఆర్ధిక) నష్టం లేకపోవచ్చునేమో కానీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పక తప్పదు. ముఖ్యంగా రాజధాని కేంద్రంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొనేవారు, పారిశ్రామికవేత్తలు, వ్యాపార సంస్థలు తీవ్రంగా నష్టపోతున్నారు. కనుక ఏనాటికైనా సిఎం జగన్మోహన్ రెడ్డి తన వైఖరిని, తన ప్రభుత్వ విధానాలను ప్రజాస్వామ్యబద్దంగా మార్చుకోక తప్పదు.