Jagan Plans utter flopటాలీవుడ్ టాప్ స్టార్స్ అందరిని వరుసగా తన ముందు కూర్చోపెట్టుకుని “అసలు హీరో” ఎవరో ప్రజలకు తెలియజేద్దామని భావించిన జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ రివర్స్ అయినట్లుగా కనపడుతోంది. టాప్ హీరోలలో ముగ్గురిని అయితే రప్పించుకోగలిగారు గానీ, అసలు ఈ ప్లాన్ లో కీలకమైన విషయాలలో పూర్తిగా విఫలమైనట్లు స్పష్టమవుతోంది.

1) జూనియర్ ఎన్టీఆర్ రాక

టాలీవుడ్ టాప్ హీరోగా కొనసాగుతోన్న జూనియర్ ఎన్టీఆర్ ను ఈ సమావేశానికి రప్పించడం ద్వారా, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీని ఇరుకున పెడదామని భావించిన వైసీపీ సర్కార్ ప్లాన్ ను తిప్పికొట్టడంలో జూనియర్ ఎన్టీఆర్ విజయవంతం అయ్యారు. ఈ విషయం తెలిసి రాలేదో, తెలియక రాలేదో అన్న విషయం పక్కన పెడితే, తారక్ మిస్సింగ్ ఈ ప్లాన్ వైఫల్యంలో నెంబర్ 1 స్థానాన్ని సొంతం చేసుకుంది.

జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ పరిణితి ఈ సందర్భంగా స్పష్టంగా కనపడుతోంది. నందమూరి – నారా కుటుంబాలకు దూరం చేసే విధంగా జగన్ మీడియా అండ్ కో ఎంతగా ప్రచారం చేస్తున్నా, తారక్ మాత్రం ఒక్క విషయంపై కూడా స్పందించకపోగా, ఎప్పటికప్పుడు తనను ఇరుకున పెట్టే విధంగా జగన్ వేస్తోన్న రాజకీయ ఎత్తుగడలను చిత్తు చేయడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు.

2) చిరంజీవి దండం

వయసులో తన కంటే చిన్న వాడైనా రెండు చేతులు జోడించి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తికి నమస్కారం చేయడం అనేది చిరంజీవి వ్యక్తిత్వానికి, సంస్కారానికి నిదర్శనంగా నిలిచిపోతోంది. నిజానికి ఈ ఉదంతం తర్వాత చిరంజీవి ఇమేజ్ గ్రాఫ్ పతాకస్థాయిలో పెరిగిపోయింది. ప్రతి చిన్న విషయానికి సోషల్ మీడియాలో విమర్శించుకునే హీరోల ఫ్యాన్స్ అంతా కూడా ఈ అంశంపై ఒక్క తాటి పైకి వచ్చారు.

మరోవైపు చిరంజీవి స్థాయి వ్యక్తి నమస్కారం పెడుతుంటే, నవ్వుతూ తల అటు ఇటు తిప్పిన జగన్ విధానం పెద్ద ఎత్తున విమర్శలకు దారి తీసింది. దీంతో సింపతీ మొత్తం చిరంజీవి వైపుకు వెళ్లిపోగా, ఈ ఉదంతం ద్వారా ఎంతో ఎత్తుకు ఎదుగుదామని భావించిన జగన్ ఎత్తుగడ మాత్రం ఓటమి పాలయ్యింది. గతంలో ప్రజారాజ్యం విలీనం సమయంలో తుడిచిపెట్టుకుపోయిన చిరు పొలిటికల్ ఇమేజ్ ను తిరిగి మెగాస్టార్ సొంతం చేయడంలో వైఎస్ జగన్ అండ్ కో వేసిన ప్లాన్ ఉపయోగపడింది.

3) నవ్వుముఖం లేని మహేష్ అండ్ కో

రాజకీయాలకు అతీతంగా తమ పనులు తాము చేసుకుంటూ వెళ్లిపోయే మహేష్, ప్రభాస్ వంటి హీరోలు, రాజమౌళి, కొరటాల శివ వంటి డైరెక్టర్లు సైతం కేవలం ‘థాంక్స్’ చెప్పించుకోవడానికే రప్పించుకున్నారని వీడియోలో స్పష్టం కావడం, వీరందరి ముఖాలలో ఒక్కరు కూడా నవ్వు ముఖం లేకుండా కనిపించిన వైనం… అభిమానులను కలవరపెట్టింది. దీంతో సోషల్ మీడియాలో వారి వారి ఫ్యాన్స్ నుండి భారీ స్థాయిలో విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తోంది.

ఎప్పుడూ నవ్వుతూ ఉండడమే తన గ్లామర్ సీక్రెట్ గా మహేష్ పలు సందర్భాలలో చెప్పగా, తాజాగా బాలకృష్ణ ‘అన్ స్టాపబుల్’ కార్యక్రమంలో కూడా ఈ విషయాన్ని మహేష్ ప్రస్తావించారు. కానీ ఇప్పుడు ఆ నవ్వే వైఎస్ జగన్ తీసుకున్న చర్యల వలన దూరం కావడంతో, మహేష్ ఫ్యాన్స్ కూడా భారీ స్థాయిలోనే ప్రతివిమర్శలకు పదునుపెట్టారు.

4) స్పష్టత లేని ప్రకటనలు

విధం చెడినా ఫలితం దక్కాలి అంటారు పెద్దలు. కానీ ఇక్కడ టాలీవుడ్ దిగ్గజాలు వచ్చినా, ప్రభుత్వం నుండి అధికారికంగా ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. గతంలో మాదిరే చేస్తాము, చూస్తాము అన్న హామీలకే ఈ భేటీ కూడా నిలిచిపోయింది. అందులోనూ రిలీజ్ చేసిన వీడియోలలో ఏ ఒక్కరూ కూడా తమ ఇబ్బంది గానీ, సమస్యలు గానీ ప్రస్తావించలేదు, కేవలం థాంక్స్ చెప్పడానికి తప్ప!

ఇండస్ట్రీ కోసం ఒంగి ఒంగి దండాలు పెట్టినా తమకు కావాల్సిన అంశాలపై ఏ ఒక్క నిర్ణయం కూడా పేపర్ పై వెలువడకపోవడంతో, చిరు, మహేష్ లు ప్రకటించినట్లుగా వారం, పది రోజులలో అయినా సమస్య పరిష్కారం అవుతుందా? అన్న ప్రశ్నలకు తావిచ్చేలా ఈ ఉదంతం నిలిచిపోయింది. ఓటీటీకి, ఓటీపీకి తేడా తెలియకుండా సీఎం చేసిన ప్రసంగం ప్రజలు, ప్రేక్షకుల దృష్టిలో అవగాహన లేని ముఖ్యమంత్రిగా జగన్ ను మిగిల్చేసారు.