YSR Party MLA didn't spell Amaravatiమూడు రాజధానుల బిల్లును వైసీపీ సర్కార్ వెనక్కి తీసుకోబోతోంది అన్న సమాచారం వెలువడిన సమయం నుండి “ముఖ్యమంత్రి గారు సభలో ఏం చెప్పబోతున్నారు? బిల్లు వెనక్కి తీసుకోవడం అంటే అమరావతిని రాజధానిగా ప్రకటిస్తారా? లేక కొత్త రాజధానిగా మరొక నగరాన్ని చెప్తారా?” ఇలా అనేకానేక ప్రశ్నలు అందరి మదిలో మెదిలాయి.

దానికి ఏపీ అసెంబ్లీ నుండి జవాబు లభించింది. మూడు రాజధానుల బిల్లు పట్ల ఏదో అసంతృప్తిగా ఉన్న 2 లేక 3 శాతం ప్రజల కోసం, వారి అభ్యంతరాలు తెలుసుకుని మళ్ళీ పకడ్భందీగా బిల్లును రూపొందించి సభ ముందు ఉంచుతామని ప్రకటించారు. విశేషం ఏమిటంటే… ఈ బిల్లుపై మాట్లాడిన బుగ్గన గానీ, ముఖ్యమంత్రి జగన్ గానీ, అలాగే అసెంబ్లీ గానీ అమరావతి పేరు కూడా పలకకపోవడం గమనించదగ్గ అంశం.

అందరూ ఎలా మాట్లాడినా… సీఎం హోదాలో ఉన్న వారు ఎలాంటి సంకుచిత భావం లేకుండా అందరికీ న్యాయం జరిగేలా ప్రసంగించాలి. కానీ జగన్ నోటి వెంట కనీసం అమరావతి అన్న పదం రాలేదు. “తన ఇల్లు ఈ ప్రాంతంలోనే ఉంది, ఈ ప్రాంతం అంటే నాకు ఎలాంటి ద్వేషం లేదు, నిజంగా చెప్పాలంటే ఈ ప్రాంతం నాకు చాలా ఇష్టం… ఎందుకంటే ఏడాదికి మూడు పంటలు పండే భూములున్నాయి” అన్నారు.

ఈ ప్రాంతం ఇటు గుంటూరుకు గానీ, అటు విజయవాడకు గానీ దగ్గర కాకుండా ఎటు పోవాలన్నా 40 కిలోమీటర్లు వెళ్లాలని, ఈ ప్రాంత ప్రజలతో గానీ, ఎవరితో తనకు ఎలాంటి విద్వేషాలు లేవని, అందుకే పరిపాలన రాజధానిగా ఈ ప్రాంతాన్ని ఎంపిక చేశామని చెప్పుకొచ్చారు. ఇదే సందర్భంలో 3 రాజధానులలో ఇతర రెండు ప్రాంతాలైన కర్నూల్ మరియు విశాఖ నగర పేర్లు పలు సార్లు ప్రస్తావించారు ఏపీ సీఎం.

తాను అక్కడే ఉండడం వలన ‘ఈ ప్రాంతం’ అన్నారని సరిపెట్టుకోవాలో లేక కనీసం మాట వరుసకు కూడా ‘అమరావతి’ పేరును ప్రస్తావించకపోవడం అనేది ఒక ఉద్దేశ పూర్వకంతో ప్రణాళికా బద్ధంగా అనుసరిస్తున్నారో ముఖ్యమంత్రి వర్యులకే తెలియాలి. ఎందుకంటే… జగన్ ఇలా ‘అమరావతి’ పేరును ప్రస్తావించకపోవడం ఇదే తొలిసారి కాదు. గతంలో జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అయితే ఏకంగా ‘స్కిప్’ చేయమన్న వీడియో అప్పట్లో తెగ సందడి చేసింది.