Nadu Pawan Nedu Jagan Same to Sameప్రజలు ఆపదలో ఉంటే తన హృదయం కలిచి వేస్తుందని, అయితే ఆ సమయంలో తనకున్న ఇమేజ్ కారణంగా ప్రజల వద్దకు వెళ్లలేకపోతున్నానని, ఒకవేళ వెళితే ప్రజలు, అభిమానులు తనను చూడడానికి ఎగబడతారని, అది సహాయక చర్యలకు విఘాతం కలుగుతుందని, ఆ సమయంలో తాను వెళ్లడం కన్నా, సహాయక చర్యలు జరగడం ముఖ్యమని… హుధుద్ తుఫాన్ విశాఖ తీరాన్ని తాకి అల్లకల్లోలం సృష్టించిన సమయంలో ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలివి.

తాను వరద ప్రభావిత ప్రాంతాలకు ప్రత్యక్షంగా వెళితే అధికారులందరూ తన చుట్టే తిరుగుతారని, దాని వలన సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని సీనియర్ అధికారి ఒకరు చెప్పిన సలహాతో తాను వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించలేకపోతున్నానని, నిజానికి అక్కడికి వెళ్లి ప్రజలను ప్రత్యక్షంగా కలవాలని తనకూ ఉందని… ప్రతిపక్షాలు చేస్తోన్న విమర్శలకు అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి జగన్ ఇచ్చుకున్న వివరణ ఇది.

నాడు పవన్, నేడు జగన్… కాస్త అటు ఇటుగా దాదాపుగా ఇద్దరూ రకమైన ప్రకటనలు చేసారు. నిజానికి ఇద్దరు చెప్పిన మాటల్లో లాజిక్ ఉంది, వాస్తవం కూడా ఉంది. ‘అప్పుడప్పుడు జనాల్లోకి వెళితే జనాలు ఎగబడతారు కానీ, నిత్యం ప్రజల మధ్యే ఉంటే ఆ ఇబ్బంది ఉండదు’ అని నాడు పవన్ స్పందనపై విశ్లేషకులు సలహాలు ఇచ్చారు. దానిని జనసేన అధినేత ఇప్పటికీ అమలులోకి తీసుకురాలేకపోయారు, అది వేరే విషయం! ఎన్నికలకు ఇంకా సమయం ఉంది గనుక వేచిచూసే ధోరణిలో జనసేన అధినేత ఉన్నట్లుగా కనపడుతోంది.

వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో జగన్ సర్కార్ విఫలమైందని ప్రతిపక్షాలతో పాటు రాజకీయ పండితులు కూడా వెల్లడిస్తున్నారు. ఇలాంటి సమయంలో జగన్ ప్రత్యక్షంగా పాల్గొంటే కనీసం అధికారుల్లో చలనం వచ్చి ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుందని, అలాగే అధికార యంత్రాంగం మొత్తం ‘అలెర్ట్’ అవుతారని, తద్వారా అటు ప్రజలకు మేలు చేసిన వారవుతారని, ప్రతిపక్షాలను నిలువరించి వారవుతారని రాజకీయ విశ్లేషకులు సలహాలు ఇస్తున్నారు. జగన్ వర్యులు కూడా ఈ సలహాలను పెడచెవిన పెట్టారని అసెంబ్లీ ప్రకటనతో స్పష్టమైంది.