Jagan Meetingఈరోజు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సిఎం జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేల ప్రోగ్రస్ కార్డుల రిపోర్ట్ బయటపెట్టేశారు. తాను ఏ ఒక్క సిట్టింగ్ ఎమ్మెల్యేని కూడా వదులుకోవాలనుకోవడం లేదు కానీ దాదాపు 25 మంది ఎమ్మెల్యేల ‘గ్రాఫ్’ ఏమంత గొప్పగా లేదని చెప్పేశారు. గ్రాఫ్ బాగుంటేనే ప్రజలు గెలిపిస్తారు లేకుంటే లేదు కనుక గ్రాఫ్ పెంచుకోవడం కోసం 25 మంది గట్టిగా కృషి చేయాలని సిఎం జగన్‌ హితవు పలికారు. ఏడాదిలోగానే ఎన్నికలున్నాయి కనుక గ్రాఫ్ ఇంప్రూవ్ చేసుకోకపోతే వారికీ వారి వలన పార్టీకి కూడా నష్టం కలుగుతుంది. కనుక అటువంటివారిని ఉపేక్షించలేనన్నారు. అంటే టికెట్స్ ఇవ్వదలచుకోలేదని చెప్పేసిన్నట్లే.

గత రెండు సమావేశాలలో ఇదే విషయం వేరే పదాలతో వేరేలా చెప్పి ఉండవచ్చు కానీ అన్నిటి తాత్పర్యం మాత్రం ఒక్కటే. పనితీరు బాగోని వారికి టికెట్స్ లభించవని!ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేల స్థానంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లను నియమించడం ద్వారా వారి మెడలపై జగనన్న కత్తులు ఉంచారు. కనుక మిగిలినవారికి ఇదే తుది హెచ్చరికగా భావించవచ్చు.

గ్రాఫ్ ఇంప్రూవ్ చేసుకోకపోతే టికెట్‌ నిరాకరించడం అన్ని పార్టీలలో ఉన్నదే కనుక సిఎం జగన్‌ గ్రాఫిక్ హెచ్చరికలను అన్యధా భావించాల్సిన అవసరం లేదని మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి ‘కుషనింగ్’ ఇచ్చారు.

ఈరోజు సమావేశంలో సిఎం జగన్‌ మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టారు.

·రాష్ట్రంలో అర్బన్ ప్రాంతాలలో (84%), రూరల్ ప్రాంతాలలో (92%) ప్రజలకు మంచి (అంటే సంక్షేమ పధకాలు) చేయగలిగాము. సగటున 87% మందికి మంచి చేయగలిగాము. కనుక మెజార్టీ ప్రజలను సంతృప్తి పరిచిన్నట్లే.
వారందరినీ మన పార్టీకి ఓట్లేసేలా చేయడమే కాదు వారినే మన పార్టీకి ప్రచారకర్తలుగా వినియోగించుకోవాలి. (అంటే వారి ఓట్ల కోసమే సంక్షేమ పధకాలు ఇస్తున్నట్లు ధృవీకరించిన్నట్లే కదా?)

·సంక్షేమ పధకాల ద్వారా లబ్ధి పొందిన 80 లక్షల మందిలో కేవలం రెండున్నర లక్షల మంది మాత్రమే ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటర్లుగా ఉన్నారు. మళ్ళీ వారిలో డిబీటీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్‌) లబ్ధిదారులు 20% మందిమాత్రమే
ఉన్నారు. కనుక టిడిపి గెలుచుకొన్న నాలుగు సీట్లను ఏ లెక్కన రాష్ట్ర ప్రజల తీర్పుగా పరిగణించగలము? (ఒకవేళ ఆ నాలుగు సీట్లు కూడా వైసీపీ గెలిస్తే ప్రజలందరూ మా వైపే ఉన్నారని చెప్పుకోకుండా ఉంటారా?)

·నాకు రాజకీయాల కంటే మానవసంబంధాలే ముఖ్యం. మీరందరూ మళ్ళీ గెలిచి పదవులు, అధికారం సంపాదించుకోవాలనే నా ఈ తాపత్రయం అంతా. అందుకే ఈ కార్యక్రమాలన్నీ. (అంటే పేద ప్రజల సంక్షేమం కోసం కాదన్న
మాట!)

·మీ గ్రాఫ్ పెంచుకోకపోతే మీరూ, మీతో పాటు పార్టీ కూడా నష్టపోతుంది. (దానర్దం గ్రాఫ్ పెంచుకోకపోతే టికెట్స్ లభించవనే కదా?)

కొసమెరుపు: మన పార్టీ గెలవకపోతే ఆంధ్ర రాష్ట్రం, మనమీదే ఆధారపడున్న కోట్లమంది ప్రజలు నష్టపోతారు.