jagan kcr to be exposed soon రెండు తెలుగు రాష్ట్రాల పాలకపక్షాలు ఢిల్లీలో ఒక వైఖరి, గల్లీలో ఒక వైఖరి అవలంభిస్తూ వస్తున్నాయి. రాష్ట్రంలో తమ ఓటు బ్యాంకు కోసం బీజేపీని ఎదిరిస్తునట్టుగా నటిస్తూ కేంద్రంలో మాత్రం బీజేపీకి అవసరమైన అన్ని సందర్భాలలోనూ పార్లమెంట్ సాక్షిగా కీలక బిల్లులలో మద్దతు ఇస్తున్నాయి.

కొన్ని బిల్లులకు ఢిల్లీలో మద్దతు ఇచ్చి రాష్ట్రాలలో వ్యతిరేకించడం మనం చూశాం. అయితే తెలంగాణలో ఎన్నికలకు ఇక ఏడాదే ఉంది. ఆంధ్రప్రదేశ్ లో రెండేళ్లే సమయం ఉంది. ఇక దాగుడు మూతలకు తెరదించుతారా అనేది చూడాలి. తాజాగా ఈరోజు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో రెండు రాష్ట్రాలకు కేంద్రం మొండి చెయ్యి చూపించింది.

పోలవరం, విభజన హామీల కింద దాదాపుగా 23,000 కోట్లు ఆశించింది జగన్ ప్రభుత్వం. అయితే బడ్జెట్ లో ఒక్క రూపాయి కూడా రాష్ట్రానికి రాలేదు. ఇక తెలంగాణలో అనేక ప్రాజెక్టులు, నిధుల కోసం రెండు నెలల నుండి లేఖలు రాస్తుంటే నయా పైసా కూడా రాలేదు. ఈ బడ్జెట్ మీద కేసీఆర్ ఒక ప్రెస్ మీట్ పెట్టి మోడీ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.

ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయితే జగన్ మాత్రం మౌనమునిగా మారిపోయారు. కేంద్రాన్ని ఒక మాట అనే ధైర్యం కూడా చెయ్యలేదు. అయితే ఈ ఏడాది జులైలో రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఇందులో గెలుపు కోసం రెండు తెలుగు రాష్ట్రాలలో మెజారిటీ సీట్లు ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్, తెరాస లు కీలక పాత్ర పోషించనున్నాయి.

ఇప్పటిదాకా తెరవెనుక వ్యవహారం ఇప్పుడు బట్టబయలు కానుంది. రాష్ట్రాలను మోసం చేస్తున్న కేంద్రానికి మద్దతు ఇస్తారా అనేది చూడాలి. ఒకవేళ ఈ ఎన్నిక లో బీజేపీకి మద్దతు ఇస్తే రెండు పార్టీలకు రాష్ట్ర ప్రయోజనాల కంటే తమ రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని చెప్పేసినట్టే.