Jagan KCR Politics what they done to two  telugu statesఇక్కడ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సిఎం జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి ముఖ్యంగా… ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాలకు వీరవిధేయంగా వ్యవహరిస్తున్నారు. అక్కడ తెలంగాణ సిఎం కేసీఆర్‌ ప్రధాని నరేంద్రమోడీమీద కత్తులు దూస్తున్నారు. పూర్తి భిన్నంగా రాజకీయాలు చేస్తున్న వారిరువురితో రెండు తెలుగు రాష్ట్రాలకు కొత్తగా ఒరిగిందేమిటి?వారి తీరుతో రాష్ట్రాలకు జరుగుతున్న లాభం ఏమిటి? నష్టం ఏమిటి? అని ప్రశ్నించుకొంటే, కేంద్రంతో సక్యతగా ఉన్నా ఎటువంటి లాభమూ లేదు… కత్తులు దూస్తున్నా లాభం లేదు నష్టం తప్పించి అని అర్దం అవుతుంది.

ముందుగా ఏపీ విషయానికి వస్తే సిఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పెద్దలకి ఎంత విధేయంగా ఉన్నా ఈ మూడున్నరేళ్ళలో ఎప్పటికప్పుడు అప్పులు తప్ప అటు అమరావతిని ఇటు మూడు రాజధానులకు గానీ పూర్తిచేయించలేదు. కనీసం పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేదు. అన్ని రాష్ట్రాలతో పాటు ఇచ్చే అప్పులు, నిధులు, ప్రాజెక్టులే తప్ప ఏపీకి అదనంగా ఇచ్చినవి ఏమీ లేవు. విభజన హామీలు ఇంతవరకు అమలుచేయనే లేదు.

కేంద్ర ప్రభుత్వం ఏపీని ఎందుకు పట్టించుకోవడం లేదంటే ప్రస్తుతం దాని దృష్టి అంతా తెలంగాణ మీదే ఉంది. ఆ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ దాని తదుపరి లక్ష్యం కనుక అప్పుడు సిఎం జగన్మోహన్ రెడ్డి వీర విధేయత ప్రదర్శించినా ఎటువంటి ప్రయోజనం ఉండబోదు.

అయితే ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్‌ని ఏవిదంగా కట్టడి చేయాలని కేంద్రం ప్రయత్నిస్తోందో అదేవిదంగా భవిష్యత్‌లో జగన్‌ని, వైసీపీని కూడా కట్టడి చేసేందుకు ప్రయత్నించడం తధ్యం. అదీగాక అక్రమాస్తుల కేసులు ఉండనే ఉన్నాయి. అవసరం పడినప్పుడు వాటిని అటకమీద నుంచి దింపి దుమ్ము దులుపుతుంది. కనుక వైసీపీ మరో ముప్పై ఏళ్ళు అధికారంలో ఉంటామని భ్రమలో బ్రతికితే బిజెపికి అభ్యంతరం ఏమి ఉండదు.

ఇక తెలంగాణ సిఎం కేసీఆర్‌ “నా బంగారు తెలంగాణ పుట్టలో వేలు పెడితే కుట్టనా?” అన్నట్లు వ్యవహరిస్తున్నారని చెప్పవచ్చు. తెలంగాణలో ఎప్పటికీ తామే అధికారంలో ఉండాలనుకొంటుంటే రాష్ట్రంలో బిజెపి క్రమంగా బలపడి టిఆర్ఎస్‌కు ప్రమాదకరంగా మారడం చేతనే కేసీఆర్‌ కేంద్రంపై యుద్ధం ప్రకటించారని చెప్పుకోవచ్చు.

అలాంటప్పుడు ఆయన తెలంగాణలో బిజెపి మీద కదా యుద్ధం చేయాలి?కానీ ప్రధాని నరేంద్రమోడీ మీద ఎందుకు చేస్తున్నారు?మోడీకి తెలంగాణకి ఏం సంబందం?అని అనుకోవచ్చు. తెలంగాణ బిజెపిలో తన స్థాయి నాయకులు ఎవరూ లేరని కేసీఆర్‌ భావిస్తుండటం ఒక కారణమైతే, రాష్ట్రంలో బిజెపిని నిలువరించాలంటే మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రగిలించక తప్పదని భావించడం మరో కారణంగా కనిపిస్తోంది. అందుకే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేస్తోందనే వాదనను బలంగా ప్రజలలోకి తీసుకుపోయేందుకు ప్రయత్నిస్తున్నారు.

అయితే కేసీఆర్‌ చేస్తున్న పోరాటాల వలన రాష్ట్రానికి ఇప్పుడు నిజంగానే అన్యాయం జరుగుతోందని చెప్పవచ్చు. తెలంగాణకు కేంద్రం చాలా చేస్తున్నప్పటికీ, కేసీఆర్‌, టిఆర్ఎస్‌ నేతలు ఏమీ చేయడం లేదనే ప్రచారం చేస్తున్నారు కనుక చేసి ప్రయోజనం లేదని కేంద్రం అనుకొంటే నష్టపోయేది కేసీఆర్‌ కాదు… టిఆర్ఎస్‌ కాదు. ప్రజలు… రాష్ట్రమే.

ఏపీలో బిజెపి ఇప్పట్లో అధికారంలోకి రాలేదు కనుక ఏపీకి ఏమీ చేయకపోతే, తెలంగాణలో కేసీఆర్‌ కత్తులు దూస్తున్నందున ఏమీ చేయవలసిన అవసరం లేకుండా పోయిందని చెప్పవచ్చు. మొత్తం మీద ఇరువురు ముఖ్యమంత్రుల తీరు ఎలా ఉన్నప్పటికీ రెండు రాష్ట్రాలకు ప్రయోజనం లేకుండా పోయిందని చెప్పవచ్చు.