Jagan-KA-Paul-Ali-Posaniబటన్ నొక్కుడు సభలో సిఎం జగన్మోహన్ రెడ్డి తప్పక చెప్పుకొనేది నేను ఒంటరిగా పోరాడుతుంటే నామీద దాడి చేయడానికి తోడేళ్ళ గుంపు వస్తోందని. అయితే నిజంగానే జగన్‌ ఒంటరి పోరాటం చేస్తున్నారా? అంటే కాదనే చెప్పాలి. మొదటి నుంచే ఆయన వెనక ఐప్యాక్ ఉంది. రంగులు వేయడం, స్టిక్కర్స్ అంటించడం, పేర్లు మార్చడం, రోడ్లపై మంత్రులు చొక్కాలు చించుకోవడం వంటి విచిత్రమైన ఐడియాలన్నీ అదే ఇస్తోంది.

ఇక సినిమాలు తీయడం తప్ప అన్ని చేసే వివాదాల రాంగోపాల్ వర్మ ట్విట్టర్‌లో ఎప్పుడూ వైసీపీని కనిపెట్టుకొనే ఉంటాడు. ఆయనలోని దర్శకుడు నిత్యం రంద్రాన్వేషణ చేస్తూ టిడిపి, జనసేనలపై ఏదో ఓ కామెంట్స్ చేస్తూనే ఉంటాడు. సినిమా ఇండస్ట్రీలో విలక్షణ నటుడైన పోసాని కృష్ణ మురళికి కూడా వైసీపీ ప్రభుత్వం ఓ కుర్చీ ఇవ్వడంతో ఆయన కూడా వైసీపీ తరపున వాదిస్తూనే ఉంటారు. ఏవో విమర్శలు చేస్తూనే ఉంటారు.

హాస్యనటుడు ఆలీని కూడా వైసీపీ తెచ్చుకొంది కానీ ఆయనకు ఇంతవరకు ‘డ్యూటీ అలాట్’ చేసిన్నట్లు లేదు. అందుకే ఆయన ఇంతవరకు మీడియా ముందుకు రాలేదు. వైసీపీ భాషలో మాట్లాడలేదు… టంగ్ స్లిప్ అవలేదు. స్లిప్ అయితే మాత్రం ధర్టీ ఈయర్స్ ఇండస్ట్రీ కూడా ఎందుకు పనికిరాదు.

ఇక లక్ష్మీ పార్వతి గెస్ట్ రోల్ చేస్తూనే ఉంటారు. అవసరాన్ని బట్టి ఎంట్రీ ఇస్తూ చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేసుకొని ఏవో ఓ విమర్శలు చేస్తుంటారు. వైసీపీకి శల్యసారధ్యం చేసేందుకు సజ్జల రామకృష్ణారెడ్డికి భారీగా జీతభత్యాలు ఇచ్చి పెట్టుకొన్న సంగతి తెలిసిందే. ఆయన వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి కేసు మొదలు మూడు రాజధానుల వరకు అన్ని కేసులను తాడేపల్లిలో కూర్చొని వాదిస్తుంటారు.

ఇక మంత్రులు అంబటి రాంబాబు, రోజా, గుడివాడ అమర్నాథ్ , మాజీ కొడాలి, మాజీ అనిల్ వంటివారు చాలా మంది జగనన్నను కాసుకోవడానికి ఎల్లపుడూ సిద్దంగా ఉండనే ఉన్నారు. ఇటీవలే విమలారెడ్డి కూడా వచ్చి అవినాష్ రెడ్డికి ఊరట కలిగించే నాలుగు ముక్కలు చెప్పి వెళ్లారు.

వీళ్ళందరూ ఒక ఎత్తైతే కనబడని ఆ నాలుగో సింహమే కేసీఆర్‌. “బిఆర్ఎస్ పార్టీతో ఏపీలోకి వచ్చేస్తున్నా… సునామీ సృష్టిస్తానంటూ గాండ్రించిన ఆయన వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ వరకు మనుషులను పంపించి వెనక్కు తీసుకువెళ్ళిపోయారు. వైసీపీ అవసరాన్ని బట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు తన బ్యాండ్ బెటాలియన్‌తో దిగిపోయి, టిడిపి, జనసేన, కాంగ్రెస్, బిజెపిలను వాటి ఓట్లను చీల్చి చెండాడేసి వైసీపీని మళ్ళీ గట్టెకించేందుకు ప్రయత్నిస్తారు. తెలంగాణ అభివృద్ధికి ఇది చాలా అవసరం కూడా.

అయితే ఇన్ని పులులు, సింహాలు, వర్మలు, పోసానులు వెంట ఉన్నా, రాష్ట్రంలో అందరి నెత్తిన చెయ్యి పెట్టి ఆశీర్వదించే జగనన్న అప్పుడప్పుడు ఢిల్లీకి వెళ్ళి పెద్దల ఆశీర్వాదం కూడా తీసుకొంటూనే ఉన్నారు. కనుక జగనన్న హెలికాఫ్టర్‌లో వెళుతున్నపుడో, బటన్ నొక్కుడు సభలోనో ఒంటరిగా కనిపించినంత మాత్రాన్న ఒంటరిగా ఉన్నారనుకోవడానికి లేదు. ఆయన వెనుక ఇంత పెద్ద సైన్యం ఉంది.

ఈ లెక్కన చంద్రబాబు నాయుడుకి పవన్‌ కళ్యాణ్‌, పవన్‌ కళ్యాణ్‌కు చంద్రబాబు నాయుడు తప్ప మరెవరూ లేరనే చెప్పాలి. అయితే వారిరువురూ ఎక్కడ సభలు, రోడ్ షోలు నిర్వహించిన జనాలు స్వచ్ఛందంగా పోటెత్తుతుంటారు. జగన్‌ కంచుకోట జమ్మలమడుగులో నారా లోకేష్‌ పాదయాత్ర చేస్తున్నప్పుడు బహిరంగసభ నిర్వహిస్తే, జనాలు పోటెత్తడం చూసి, వైసీపీ నేతలు కూడా షాక్ అవుతున్నారు. కనుక వచ్చే ఎన్నికల కురుక్షేత్రంలో ఏదో జరుగబోతోంది. అదేమిటో కురుపాండవులకే తెలియాలి.