jagan in another Quid Pro Coఇటీవలే అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతులకు వ్యతిరేకంగా కోర్టులో వాదించినందుకు అడ్వకేట్ ఎస్ నిరంజన్ రెడ్డికి జగన్ ప్రభుత్వం రూ 96 లక్షల ఫీజు చెల్లిస్తూ ఒక జీవో విడుదల చేసింది. పైగా పుండు మీద కారం చల్లినట్టు అదీ అమరావతి అధారిటిని చెల్లించమనడం గమనార్హం. అయితే అమరావతి పట్ల జగన్ ప్రభుత్వం కనబరుస్తున్న వైఖరి కారణంగా ఇది కొత్త అనిపించడం లేదు.

అయితే ఇందులో క్విడ్ ప్రో కో కోణాన్ని వెలికి తీశారు సీనియర్ జర్నలిస్ట్ రమేష్ కందుల. అమరావతి కేసులు వాదిస్తున్న అడ్వకేట్ ఎస్ నిరంజన్ రెడ్డి జగన్ మోహన్ రెడ్డి అవినీతి కేసులు కూడా విచారిస్తున్నారని… అదే లాయర్ ని రాష్ట్ర ప్రభుత్వ లాయర్ గా పెట్టుకుని ఆయనకు పెద్ద ఎత్తున చెల్లింపులు చెయ్యడం క్విడ్ ప్రో కో కిందకు వస్తుందని ఆయన ఆరోపణ.

తన కేసులకు సంబంధించిన లాయర్ ఫీజులు… ప్రభుత్వ ఖజానా నుండి వేసిన పథకం ఇది అంటూ పలువురు సోషల్ మీడియాలో ఆయనను సమర్థిస్తూ అంటున్నారు. దీనిపై ప్రభుత్వం గానీ, ఇటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గానీ ఎటువంటి సమాధానం చెబుతుందో చూడాలి.

ఇది ఇలా ఉండగా… జగన్ బెయిల్ రద్దుకు ఎంపీ రఘురామ కృష్ణంరాజు వేసిన కేసును సిబిఐ కోర్టు జూన్ 1కి వాయిదా వేసింది. అఫిడవిట్లు వేసేందుకు జగన్, సిబిఐలకు చివరి అవకాశం ఇచ్చింది కోర్టు. ఆ రోజుకు గనుక అఫిడవిట్ వెయ్యకపోతే మరో అవకాశం ఇవ్వకుండా డైరెక్ట్ ఆ వాదనలు వినడం మొదలు పెడతామని కోర్టు హెచ్చరించింది.