Andhra Pradesh Assembly - Jaganవైఎస్సార్ కాంగ్రెస్ నేతల మాటలు చిత్రంగా ఉంటాయి. మండలిలో టీడీపీ మెజారిటీ ఉండటాన్ని, అక్కడ మూడు రాజధానుల బిల్లుని అడ్డుకోవడం మంత్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది ఇలా ఉండగా సీఎంను తుగ్లక్‌ అని అనడం సంస్కారమా? అని నిలదీశారు మంత్రి అవంతి శ్రీనివాస్. తమకు సంస్కారం ఉందని.. మిమ్మల్ని లోకేష్‌ అనే సంబోధిస్తామని అవంతి స్పష్టం చేశారు.

అయితే టీడీపీ వారు మాత్రం ఈ విషయంగా వైఎస్సాఆర్ కాంగ్రెస్ ను, సదరు మంత్రిగారిని ఎద్దేవా చేస్తున్నారు. సభలో ఆన్ ది రికార్డు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను బజారు రౌడీలు అనవచ్చు గానీ తమకు మంత్రులు సంస్కారం గురించి నేర్పుతారా అని వారు ప్రశ్నిస్తున్నారు? ముందు బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారికి సంస్కారం నేర్పిస్తే మంచిది అని ఎద్దేవా చేస్తున్నారు.

ఈరోజు అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు నిరసన తెలుపుతుండగా ముఖ్యమంత్రి ఆగ్రహంతో ఊగిపోయారు. టీడీపీ సభ్యులు 10 మంది ఉన్నారు.. వీళ్ల కంటే వీధి రౌడీలు చాల బెటర్‌ అని జగన్‌ వ్యాఖ్యానించారు. స్పీకర్‌ను అగౌరవపరుస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని.. దీంతో వైసీపీ నేతలు రెచ్చిపోయి దాడి చేస్తే.. ఆ ఘటనను రాజకీయం చేసి లబ్ధిపొందే దిక్కుమాలిన పార్టీ టీడీపీ అని జగన్ తీవ్ర స్థాయిలో విమర్శించారు.

అయితే ముఖ్యమంత్రి దాడులు చేస్తామని బెదిరింపులకు దిగుతున్నారని, బెదిరింపులకు తాము భయపడమని టీడీపీ నాయకులు కూడా గట్టిగానే సమాధానం చెబుతున్నారు. ఎమ్మెల్యేలను బజారు రౌడీలని అన్నా, దాడులు చేస్తామని పరోక్షంగా బెదిరించినా స్పీకర్ వారించకపోవడం ఏంటని టీడీపీ వారు విమర్శిస్తున్నారు.