జగన్ స్కీంకు తొలి ఆత్మహత్యాయత్నం!తన తండ్రి వైఎస్సార్ మరణం వలన చనిపోయిన వారి కోసం ‘ఓదార్పు యాత్ర’ చేస్తానని చెప్పి, కాంగ్రెస్ ఎన్ని ఆటంకాలు సృష్టించినా, ఎదురొడ్డి చివరికి ‘ఓదార్పు యాత్ర’ను ముగించి, ప్రజల ప్రాణం కోసం ఏదైనా చేస్తానని నాడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చాటి చెప్పినట్లయింది.

కానీ నేడు అదే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రవేశపెట్టిన ఓ పధకం ప్రజల ప్రాణాలను బలితీసుకునే విధంగా మారిందా? మరి ఇప్పుడు కూడా ‘ఓదార్పు యాత్ర 2.0’ చేస్తారా? లేక ఆ పధకాన్ని రద్దు చేస్తారా? లేక ప్రాణాలను బలిగొన్న తర్వాత ‘కాసుల’ ప్రకటన చేస్తారా? ఇవి ప్రజల మదిలో ప్రస్తుతం మెదులుతోన్న ప్రశ్నలు.

ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నం అయ్యేలా ఈనాడు దినపత్రికలో ఓ కధనం ప్రచురితం అయ్యింది. నెల్లూరు జిల్లాలోని వరికుంటపాడు మండలం తూర్పు కొండారెడ్డిపల్లెలో నివసిస్తోన్న 62 ఏళ్ళ పెద గురవయ్యను ఓటీఎస్ పధకం క్రింద 10 వేలు చెల్లించాలని సచివాలయ సిబ్బంది, వాలంటీర్ ఒత్తిడి చేయడంతో, పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించినట్లుగా అతని భార్య చిన్నిమ్మి తెలిపారు.

పూట గడవడం కూడా కష్టంగా మారిన తమకు ఈ ఓటీఎస్ క్రింద 10 వేలు కట్టకపోతే, ఇల్లు మిగలదన్న మస్తాపంతో ఈ ఆత్మహత్యకు పాల్పడినట్లుగా చెప్పారు. ప్రస్తుతం ఒంగోలులో చికిత్స పొందుతున్న గురవయ్యపై తాము ఒత్తిడి తీసుకురాలేదని, కేవలం ఓటీఎస్ ప్రయోజనాలు తెలిపామని సచివాలయ అధికారులు చెప్తున్నారు.

గ్రౌండ్ లెవల్ లో ప్రజలతో అధికారులు ఏం చెప్తున్నారో, ఎలా చెప్తున్నారో అనే విషయంపై ఇప్పటికే అనేక వీడియోలు సోషల్ మీడియాను చుట్టేసాయి. ఓటీఎస్ పధకం పేద ప్రజల మెడకు ఉచ్చు బిగుసుకునేలా మారిందా? దీనిపై జగన్ సర్కార్ ఓ స్పష్టమైన ప్రకటన చేయని నేపధ్యంలో జరగబోయే పరిణామాలకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందని ప్రతిపక్షాలు కూడా హెచ్చరిస్తున్నాయి.