Jagan-Houses-for-Poor In amaravatiవైసీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా అంగీకరించడం లేదు కనుక సీఆర్డీఏ పరిధిలోని నిడమర్రు, కృష్ణరాయపాలెం, నవులూరు, ఐనవోలు, మందడం, కురగల్లు, యర్రబాలెం, పిచ్చుకలపాలెం, బోరుపాలెం, నెక్కల్లు, అనంతవరంలో భూములను ఒక్కో సెంటు చొప్పున ప్లాట్లుగా వేసి నేడు 50,793 మంది మహిళల పేరిట పట్టాలు పంచిపెట్టబోతోంది.

గుంటూరు జిల్లా తూళ్ళూరు మండలంలోని వెంకటపాలెంలో జరుగబోయే ఈ కార్యక్రమంలో సిఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొని స్వయంగా పేదలకు సెంటు భూమి పట్టాలు అందజేయనున్నారు. సీఆర్డీఏ పరిధిలో మొత్తం 1,402 ఎకరాలలో 25 లేఅవుట్లు వేసి పంచిపెట్టబోతున్నారు. వీటితో పాటు గత ప్రభుత్వం హయాంలో కేంద్ర ప్రభుత్వం సహకారంతో రూ.443.71 కోట్ల వ్యయంతో నిర్మించిన టిడ్కో ఇళ్ళను సిఎం జగన్‌ లబ్ధిదారులకు అందజేయనున్నారు.

దీనిని రాజధాని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నిరసనలకు పిలుపునిచ్చారు. ప్రతిపక్షాలు కూడా ఈ సెంటు భూముల పంపినీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇది ఊహించిందే కనుక భారీగా పోలీసులను మోహరించి రైతులను, ప్రతిపక్ష నేతలను ఎక్కడికక్కడ నిర్బందిస్తున్నారు. రైతు సంఘాల నాయకులను గృహ నిర్బందం చేస్తున్నారు.

ఇక ఈ సెంటు భూములపై యాజమాన్య హక్కులు తుదితీర్పుకు లోబడి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. అంటే ఒకవేళ కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే లబ్ధిదారులు ఆ భూములను వదులుకోక తప్పదన్న మాట! పేదలకు సాయపడాలని ప్రభుత్వం భావిస్తున్నట్లయితే వారికి నిర్వివాదమైన భూములను ఇవ్వాలి కానీ ఇలా కోర్టు తుదితీర్పుకు లోబడి ఉండే భూములను ఇవ్వడమంటే వారి జీవితాలతో చెలగాటం ఆడుకొంటున్నట్లే కదా?

రాజధాని ప్రాంతంలో వైసీపీకి తీవ్ర వ్యతిరేకత ఉంది కనుక అక్కడ తమ పార్టీకి కొత్తగా ఓటు బ్యాంక్ సృష్టించుకొనేందుకు, భవిష్యత్‌లో అమరావతిని మరింత వివాదాస్పదంగా మార్చేందుకు ఈవిదంగా నిరుపేదల జీవితాలతో చెలగాటం ఆడటాన్ని ఎవరూ హర్షించలేరు. వైసీపీ రాజకీయ అవసరాలు, ప్రయోజనాల కోసం తీసుకొంటున్న ఇటువంటి వివాదాస్పద నిర్ణయాలతో రాష్ట్రం, ప్రజలు ఎలాగూ నష్టపోతారు. కనీసం వైసీపీకైనా ఆశించిన ప్రయోజనం లభిస్తుందా?అంటే అనుమానమే. కనుక మొండిగా, గుడ్డిగా ముందుకు సాగవలసిన అవసరం ఏమిటి? అని ఆలోచించుకొంటే మంచిది. లేకుంటే చివరికి వైసీపీ కూడా నష్టపోవడం ఖాయం అని గ్రహిస్తే మంచిది.