ద్వేషం, అసూయ, పగ, ప్రతీకారాలతో ఎవరో ఒకరు నష్టపోతారు కానీ ఒకరి ద్వేషం వలన యావత్ ఆంధ్ర రాష్ట్రం నష్టపోయిందని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో టిడిపి 41వ వార్షిత్సవ వేడుకలలో చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ఆనాడు నేను హైదరాబాద్ నగరంలో హైటెక్ సిటీ, శంషాబాద్ విమానాశ్రయం, జీనోమ్ వ్యాలీ, అవుటర్ రింగ్ రోడ్ వంటి అనేక అభివృద్ధిపనులను ప్రారంభించాను. వాటిలో కొన్నిటిని పూర్తిచేశాను కూడా.
అలాగే రాష్ట్ర విభజన తర్వాత నేను హైదరాబాద్ కంటే అద్భుతంగా అమరావతిని నిర్మించాలనుకొన్నాను. దాని కోసం రైతుల త్యాగాలు, నేను చేసిన కృషి మీ అందరికీ తెలుసు. కానీ దురదృష్టవశాత్తు నా తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి కేవలం నాపై రాజకీయ కక్షతో అమరావతిని పాడుపెట్టేశాడు.
ఈ జగన్ రెడ్డి వ్యవహరించిన్నట్లే ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కేసీఆర్ తదితరులు వ్యవహరించి ఉండి ఉంటే నేడు హైదరాబాద్ ఇంతగా అభివృద్ధి చెంది ఉండేదా?నా మీద కక్షతో ఆంధ్రా రాష్ట్రానికె తీరని నష్టం కలుగజేశాడు ఈ జగన్ రెడ్డి. ఈయన పాలనలో గొడ్డలి, తుపాకులు, గంజాయి, అప్పులు మాత్రమే కనిపిస్తున్నాయి.
ఈ నాలుగేళ్ళలో చేసిన అభివృద్ధి ఏమీ లేకపోగా రాష్ట్రాన్ని 30 ఏళ్ళు వెనక్కు నడిపించాడు. రాష్ట్ర విభజన కంటే ఈ జగన్ రెడ్డి పాలన వలననే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగింది. నాలుగేళ్ళుగా మూడు రాజధానుల పేరుతో కాలక్షేపం చేసి, రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ని నిలిపాడు. ఇందుకు ఆంధ్ర ప్రజలందరూ ఎంతో బాధపడుతున్నారు. మార్పు కోరుకొంటున్నారు,” అని అన్నారు.
ఈ సభలో చంద్రబాబు నాయుడు మరో కొత్త ప్రతిపాదన చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలలో కొంతమంది వద్ద మాత్రమే సంపద పొగుపడుతోందని మిగిలినవారు పేదరికంలో మగ్గుతున్నారని అన్నారు. కనుక ధనవంతులు సమాజంలో పెద కుటుంబాలను దత్తత తీసుకొని వారూ జీవితంలో నిలద్రొక్కుకొని పైకి ఎదిగేందుకు తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు. టిడిపి అధికారంలోకి వస్తే దీనిని ఓ ఉద్యమంలా చేపడతామని చంద్రబాబు నాయుడు చెప్పారు.
జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని విదాల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిన పెట్టే బాధ్యత తాను తీసుకొంటానని చంద్రబాబు నాయుడు చెప్పారు. మే 27,28 తేదీల రాజమండ్రిలో మహానాడు నిర్వహిస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించారు.