YS Jagan Andhra Pradesh Finance Debtsఆమ్మో ఒకటో తారీఖు అని ఏదన్నా పేద, మధ్యతరగతి ఇంట్లో వినిపిస్తుంది కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఈ మధ్య అది పరిపాటి అయిపోయింది. ఈ మధ్య కాలంలో రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లు, జీతాలు టైం కు రావడం అనేదే జరగడం లేదు. ఈ నెల కూడా అదే పరిస్థితి ఉండబోతుందని సమాచారం.

రాష్ట్ర ఖజానాలో కేవలం రూ.500 కోట్లు మాత్రమే నిల్వ ఉండటంతో ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లు, జీతాలు సమకూర్చడం కష్టం అని తెలుస్తుంది. ఉద్యోగుల వేతనాలు, పింఛన్లకు ప్రతినెలా రూ.4,300 కోట్లు అవసరం ఉంటుంది. ఈరోజు మంగళవారం కావడంతో రిజర్వ్ బ్యాంక్ వద్ద సెక్యూరిటీల వేలం ప్రక్రియ జరుగనుంది.

అలాగే ఆత్మ నిర్భర్ ప్యాకేజీ కింద రూ.5 వేల కోట్లు ఏపీకి కేంద్రం నుంచి రావాల్సి ఉంది. దీంతో సెక్యూరిటీల వేలం ద్వారా నగదు సమీకరించుకోవాలని ఏపీ సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది. అప్పు దొరికితే… రేపు జీతాల చెల్లింపు ప్రక్రియ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఏదైనా సాంకేతిక ఇబ్బంది వస్తే మాత్రం మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.

ఇక పోతే ప్రభుత్వం వద్ద ఉన్న కొద్ది పాటి డబ్బును సామాజిక పెన్షన్లకు ప్రభుత్వం కేటాయిస్తుంది. వాలంటీర్ల ద్వారా ఇంటికి ఇంటికీ పంపిణీ చేస్తుంది. ప్రతి నెలా తమను ద్వితీయశ్రేణిగా పరిగణించి జీతాలు ఆలస్యం చెయ్యడం ప్రభుత్వ ఉద్యోగులకు మింగుడుపడటం లేదు. గతంలో చంద్రబాబు హయంలో ప్రతి నెలా మొదటి రోజునే జీతాలు వచ్చేవని వారు గుర్తు చేసుకుంటున్నారు.