jagan govt prohibition of alcohol ఆంధ్రప్రదేశ్‌లో దశలవారీగా మద్యపాన నిషేధం అమలుచేస్తామని చెప్పిన జగన్ సర్కార్ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు సమానంగా బార్లను విస్తరించేందుకు ఈరోజు మార్గదర్శకాలు జారీ చేసింది. 2022-2023 సంవత్సరాలకి గాను ప్రభుత్వం కొత్త బార్ లైసెన్సింగ్ విధానాన్ని శుక్రవారం విడుదల చేసింది. ఇక నుంచి రాష్ట్రంలో బార్లకు మూడేళ్ళ కాలపరిమితితో ప్రభుత్వం లైసెన్సులు మంజూరు చేస్తుంది. పనిలో పనిగా కొత్త పాలసీలో బార్ల లైసెన్స్ ఫీజును, వాపసు ఇవ్వబడని రిజిస్ట్రేషన్ ఫీజును ఏడాదికి 10 శాతం చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించింది.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 840 బార్లు మాత్రమే ఉన్నందున వాటిని రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలో ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అబ్కారీశాఖ కమీషనర్‌ తగిన నిర్ణయం తీసుకొంటారని ప్రభుత్వం పేర్కొంది. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అయితే ప్రతీ 10కిమీ ఒకటి చొప్పున, మున్సిపాలిటీల పరిధిలో అయితే ప్రతీ 3 కిమీకి ఒకటి చొప్పున బార్లు పెట్టుకొనేందుకు అబ్కారీశాఖ అనుమతిస్తుంది. గల్లీ గల్లీకి ఉండే వైన్ షాపులు వీటికి అదనం.

జూన్‌ నెలాఖరుతో రాష్ట్రంలో బార్ల లైసెన్సులు గడువు ముగుస్తుండటంతో జూలై 1 నుంచి ఆగస్ట్ 31 వరకు మరో రెండు నెలలు పొడిగిస్తునట్లు రాష్ట్ర రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజత్ భార్గవ నేడు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే పొడిగించిన ఈ రెండు నెలలకి జూన్‌ 27లోగా నిర్దేశిత లైసెన్స్ రెన్యూవల్ ఫీజును చెల్లించాలని ఉత్తర్వులలో సూచించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కొత్త బ్యానర్‌లో పాలసీ రాష్ట్రంలో అమలులోకి వస్తుందని ఉత్తర్వులలో పేర్కొన్నారు.