jagan govt eyeing on APSRTC Incomeప్రగతి రధ చక్రాలపై పరుగులు తీసే ఏపీఎస్ ఆర్టీసీ అంటే కష్టాలు, నష్టాలకు కేరాఫ్ అడ్రస్ అని అందరికీ తెలుసు. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు నష్టాల ఊబిలో కూరుకుపోతున్న ఏపీఎస్ ఆర్టీసీపై డీజిల్ భారం పడటంతో విలవిలలాడింది.

చివరికి వేరే గత్యంతరం లేక డీజిల్ సెస్సు పేరుతో ప్రయాణికులపై ఆ భారం వేసి రోజుకు సుమారు రూ.5 కోట్లు చొప్పున నెలకు రూ.150 కోట్ల అదనపు ఆదాయం సమకూర్చుకొని దాంతోనే భారంగా డొక్కు ఆర్టీసీ బస్సులను గుంతలు పడిన రోడ్లపై నెట్టుకొస్తోంది.

ప్రస్తుతం ఉన్న డొక్కు బస్సులలో 1,500 బస్సులను తుక్కు కింద అమ్ముకోవడానికి తప్ప వినియోగానికి పనికిరావని డిపో మేనేజర్లు నివేదికలు ఇచ్చారు. కనుక ఈ అదనపు ఆదాయంతో వాయిదాల పద్దతిలో కనీసం 400-500 బస్సులైనా కొనుగోలు చేద్దామని ఏపీఎస్ ఆర్టీసీ లెక్కలు కట్టుకొంటుంటే, నిత్యం అప్పుల వేటలో ఉండే జగన్ సర్కార్ కన్ను ఏపీఎస్ ఆర్టీసీ సమకూర్చుకొన్న ఆ కొద్దిపాటి ఆదనపు ఆదాయంపై పడింది. దానిలో నుంచి 25 శాతం ఖజానాకు జమా చేయాలని జగన్ సర్కార్ ఏపీఎస్ ఆర్టీసీకి హుకుం జారీ చేసింది. ముష్టిలో వీర ముష్టి అంటే ఇదేనేమో?

ఏపీఎస్ ఆర్టీసీకి పెంచిన టికెట్ ఛార్జీలు, డీజిల్ సెస్ ఛార్జీలు, కార్గో ఛార్జీలు, ప్రకటనలు అన్నీ కలుపుకొంటే నెలకు రూ.528 కోట్లు వస్తోంది. దానిలో 25 శాతం అంటే రూ.132 కోట్లు జమా చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అదనపు ఆదాయం రూ.150 కోట్లలో నుంచి 25 శాతం అనుకొన్నా నెలకు రూ.37.5 కోట్లు జమా చేయాల్సి ఉంటుంది.

ఏపీఎస్ ఆర్టీసీ ఆదాయం నుంచి జగన్ సర్కార్ 25 శాతం వాటా ఆశిస్తోంది కనుక డీజిల్‌పై రాష్ట్ర ప్రభుత్వం విధించే పన్నులో ఆర్టీసీకి మినహాయింపు లేదా కాస్త తగ్గింపు ఏమైనా ఇస్తోందా… అంటే అదీ లేదు. ఆ ఆదాయం కూడా వదులుకొనేందుకు జగన్ సర్కార్ ఇష్టపడటం లేదు.

సామాన్య ప్రజలపై డీజిల్ సెస్ భారం వేసినందుకు ఏపీఎస్ ఆర్టీసీ విమర్శలు భరిస్తుంటే, దానికి వచ్చే ఆదాయం నుంచి జగన్ సర్కార్ 25 శాతం తీసుకొంటోంది. అంటే సొమ్మొకడిది సోకొకడిది అన్నమాట!