jagan govt daily tests for government teachersవిద్యార్థులకు సమయానుసారం పరీక్షలు నిర్వహిస్తుండటం అందరికీ తెలుసు కానీ వారికి పాఠాలు చెప్పే ఉపాధ్యాయులకి కూడా రోజూ పరీక్షలు నిర్వహించే రాష్ట్రం దేశంలో ఎక్కడైనా ఉందా?అంటే ఉంది. అటువంటి గొప్ప ఖ్యాతి మన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికే దక్కింది. విద్యావ్యవస్థతో చెలగాటం ఆడుతున్న జగన్ ప్రభుత్వం ఇప్పుడు ఉపాధ్యాయులకు రోజూ పరీక్షలు పెడుతోంది.

నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వోపాధ్యాయులు తప్పనిసరిగా ఉదయం 9 గంటలలోపు తమతమ పాఠశాలలకు చేరుకొని ‘సిమ్స్ ఏపీ’ అనే మొబైల్ యాప్‌ ద్వారా అటెండన్స్ వేసుకోవాలి. ఒక్క నిమిషం ఆలస్యమైన వారి అటెండన్స్ రికార్డులో ఆటోమేటిక్‌గా ఆబ్సెంట్ నమోదైపోతుంది. హాఫ్ డే లేదా ఫుల్-డే లీవ్ పెట్టుకోవాలని మెసేజ్ వచ్చేస్తుంది.

దీని కోసం ఉపాధ్యాయులు అందరూ తప్పనిసరిగా తమ మొబైల్ ఫోన్లలో సిమ్స్ ఏపీ మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవలసి ఉంటుంది. ప్రతీపాఠశాలను జీపీఎస్‌తో మ్యాపింగ్ చేసినందున ఉపాధ్యాయులు పాఠశాల ఆవరణలో ఉంటేనే ఈ సిమ్స్ ఏపీ యాప్ పనిచేస్తుంది. కనుక ఎట్టి పరిస్థితులలో ఉదయం 9 గంటలలోపు ఉపాధ్యాయులు అందరూ పాఠశాలలకు చేరుకోవలసి ఉంటుంది.

అంతకంటే ముందు, హెడ్ మాస్టర్ తన మోబైల్ ఫోన్‌లో ఈ యాప్ ద్వారా ఉపాధ్యాయులందరికీ మూడు యాంగిల్స్‌లో ఫోటోలు తీసి అప్‌లోడ్‌ చేయవలసి ఉంటుంది. వాటితో బాటు ఉపాధ్యాయులు హాజరు, వారి సెలవులకు సంబందించి వివరాలను కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ప్రతీరోజూ ఉదయం 9 గంటలలోపు పూర్తిచేయాల్సి ఉంటుంది. లేకుంటే ఆ తర్వాత ‘సిమ్స్ ఏపీ’ మొబైల్ యాప్‌ లాక్ అయిపోతుంది.

మొదట్లో బయో మెట్రిక్ విధానంలో హాజరు నమోదు చేసేవారు. దానిలో 5-10 నిమిషాలు ఆలస్యమైనా అంగీకరించేది. కానీ సిమ్స్-ఏపీలో ఒక్క నిమిషం ఆలస్యమైన ఆరోజు డ్యూటీకి రాన్నట్లే పరిగణించి జీతంలో కోత విధించబోతోంది.

ఈవిధానంపై ఉపాధ్యాయులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఉదయం ట్రాఫిక్ రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎంత ముందుగా బయలుదేరినా ఒక్కోసారి ఆలస్యమవచ్చు. అంత శ్రమపడి పాఠశాలకు చేరుకొంటే నిమిషం ఆలస్యమైనా ఆబ్సెంట్ మార్క్ చేస్తామంటే ఇదెక్కడి న్యాయం? అని ప్రశ్నిస్తున్నారు.

కొంతమంది ఉపాధ్యాయులకి స్మార్ట్ ఫోన్స్ ఉన్నప్పటికీ వాటిలో ఈ యాప్స్ ఏవిదంగా ఉపయోగించాలో తెలీదు. కొంతమంది వద్ద సాధారణ ఫీచర్ ఫోన్స్ మాత్రమే ఉన్నాయి. ఒకవేళ అందరూ స్మార్ట్ ఫోన్స్ కొనుక్కొని యాప్స్ గురించి నేర్చుకొని సకాలంలో హాజరైన్నప్పటికీ, ఆ సమయంలో నెట్‌ పనిచేయకపోయినా నెట్‌ సిగ్నల్‌ సరిగ్గా లేకున్నా సిమ్స్ ఏపీలో తమ హాజరు అప్‌లోడ్‌ చేయలేరు. ఇక మారుమూల ఏజన్సీ ఏరియాలలో అసలు ఫోన్‌ చేసుకొనేందుకే సిగ్నల్ ఉండదు ఇక నెట్‌ సిగ్నల్ ఎలా వస్తుంది?అని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు.

ఇదంతా జగన్ ప్రభుత్వం తమను పొమ్మనలేక పొగ పెట్టడమే అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ విద్యావ్యవస్థలో పెను మార్పులు చేస్తున్నప్పుడు మొదట్లో ఇటువంటి ఇబ్బందులు ఉంటాయని కనుక అందరూ ఈ నొప్పులు భరించక తప్పదని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణగారు ముందే సెలవిచ్చారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా రోజూ ఈవిదంగానే హాజరువేసే విధానం అమలుచేసి చూపితే ఉపాధ్యాయుల బాధలు ఏమిటో అర్దం అవుతుంది.