Jagan Govt AP Capital Issue in Supreme Courtఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడి 8 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత రాజధాని ఏదో ఎవరూ చెప్పలేని పరిస్థితి. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం, వైసీపీ నేతలు ఏమాత్రం ప్రభుత్వం సిగ్గుపడటం లేదు. చివరికి హైకోర్టు మొట్టికాయలు వేసినా సిగ్గు పడలేదు. తమ వైఖరిని మార్చుకోలేదు. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్‌ వేసింది. దాని కోసం ఏకంగా 2,000 పేజీలను దాఖలు చేసింది. దానిని విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ఎల్‌పీ నంబర్ కేటాయించడంతో త్వరలోనే అమరావతి పంచాయతీపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టడం నిశ్చయమైంది. ఈ కేసులో తమ వాదనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ ఇప్పటికే రాజధాని రైతులు సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్లు వేశారు. కనుక సుప్రీంకోర్టు వారికీ నోటీసులు పంపించింది.

అమరావతి రాజధానిగా తమకు అంగీకారం కాదని చెపుతూ వైసీపీ మూడు రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ఓకే! కానీ మూడు రాజధానులపై కూడా వైసీపీకి చిత్తశుద్ధి లేదని చెప్పవచ్చు. ఒకవేళ వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్లయితే అధికారంలోకి రాగానే ముందుగా న్యాయవివాదాలను పరిష్కరించుకొనేందుకు గట్టిగా ప్రయత్నించి ఉండేది. కానీ మూడున్నరేళ్ళు కాలక్షేపం చేసి ఆర్నెల్ల క్రితం హైకోర్టు మొట్టికాయలు వేస్తే నెలరోజుల క్రితం తాపీగా సుప్రీంకోర్టుని ఆశ్రయించింది.

ఈ కేసు ఇప్పట్లో తేలేది కాదని వైసీపీ ప్రభుత్వానికి కూడా బాగా తెలుసు. మరో మూడు నాలుగు నెలలు ఈ కేసు కొనసాగిన తర్వాత తీర్పు అనుకూలంగా వస్తే రాజధాని ప్రక్రియ పేరుతో మరో ఆరు నెలలు దొర్లించేస్తుంది. అప్పటికి ఎన్నికలు దగ్గర పడతాయి కనుక అప్పుడు మళ్ళీ తాము అధికారంలోకి వస్తే మూడు రాజధానులు ఏర్పాటు చేసి ఉత్తరాంద్ర, రాయలసీమ జిల్లాలను అభివృద్ధి చేస్తామని హామీ ఇస్తుంది.

ఒకవేళ తీర్పు వ్యతిరేకంగా వస్తే, తాము రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకొంటే టిడిపి, జనసేనలు, రాజధాని రైతులు అందరూ కలిసి కుట్రలు పన్ని అడ్డుకొన్నారని, కనుక మళ్ళీ మరో ఛాన్స్ ఇస్తే కేంద్రం మెడలువంచైనా మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నించవచ్చు. కనుక సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా లేదా వ్యతిరేకంగా వచ్చినా వైసీపీ ప్రభుత్వం ఈ ఉపఎన్నికలలోపు రాజధాని పేరుతో రాజకీయాలు తప్ప మరేదీ చేయదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

అయితే రాజధాని పంచాయతీని సుప్రీంకోర్టుకి తీసుకువెళ్ళి వైసీపీ ప్రభుత్వం చేజేతులా చివరి తలుపు కూడా మూసేసుకొందని చెప్పవచ్చు. ఒకవేళ సుప్రీంకోర్టు అమరావతినే రాజధానిగా కొనసాగించాలని తీర్పు చెపితే, వచ్చే ఎన్నికలలో టిడిపి, జనసేన, బిజెపిలకు సానుకూలంగా మారుతుంది. ఎన్నికల ప్రచారంలో సుప్రీంకోర్టు తీర్పుని ప్రస్తావిస్తూ వైసీపీపై ముప్పేటదాడి చేయకమానవు. కనుక రాజధాని అంశంపై సుప్రీంకోర్టు వెళ్ళడం మరో పెద్ద పొరపాటే అని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ, సుప్రీంకోర్టు ఈ రాజధాని పంచాయతీపై తాడో పేడో తేల్చేస్తే రాష్ట్ర ప్రజలు కూడా చాలా సంతోషిస్తారు.