Jagan Government to removing telugu medium schools ఇంగ్లీష్ మీడియం విషయంలో తన పంతం నెగ్గించుకోవాలని కృత నిశ్చయంతో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఇప్పటికే దీనిని హై కోర్టు అడ్డుకోగా… దానిని బైపాస్ చేస్తూ… మరో రూట్ లో పని కానిచ్చే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. తమ వాలంటీర్ల ద్వారా సర్వే చేయించామని, 96.17 శాతం మంది ఇంగ్లిషు మీడియమే కావాలన్నారు అని చెప్పుకొచ్చింది ప్రభుత్వం.

కొంతమంది తల్లిదండ్రులు తెలుగులో బోధించాలని కోరినా, తెలుగు మీడియం క్లాసులు పెట్టడానికి ఖర్చవుతుంది కాబట్టి, కేవలం మండలానికి ఒక తెలుగు మీడియం స్కూల్ పెడుతుందంట ప్రభుత్వం. అంటే మొత్తం ప్రభుత్వ స్కూళ్లలో తెలుగు మీడియం స్కూళ్ళు కనీసం 10 శాతం కూడా ఉండబోవు.

మాతృభాషలో విద్యాబోధన ఉండాలని విద్యాహక్కు చట్టం చెప్పిన మాట వాస్తవమేగానీ, అదొక్కటే ముఖ్యం కాదు కాబట్టి, ఇంగ్లిషు మీడియం పెడుతున్నారట. పేద పిల్లలు మధ్యలో బడిమానేయడానికి తల్లిభాషలో పాఠాలు చెప్పకపోవడం ఒక్కటే కారణం కాదని, ఇతర కారణాలు కూడా ఉన్నాయని, అందువల్ల ఇంగ్లిషు మీడియం వల్ల నష్టం ఉండదని వాదన కూడా తెర మీదకు తీసుకొచ్చింది ప్రభుత్వం.

ఇది ఇలా ఉండగా… ఈ జీవోలో ఇంకో కొసమెరుపు కూడా ఉంది. తెలుగు మీడియం స్కూళ్ళు పెట్టడానికి మనసు రాని ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న మైనారిటీ మీడియం స్కూళ్లు… ఉర్దూ, కన్నడ, తమిళం, ఒరియా స్కూళ్లు మాత్రం కదిలించదట. తెలుగు నేల మీద కనీసం పరాయి భాషలకు దక్కిన గౌరవం కూడా తెలుగు భాషకు దక్కలేదు.