Jagan government targets TDP leadersటీడీపీ మహానాడుకు రెండు రోజుల ముందు ఆ పార్టీ నుండి ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు… ఇతర కీలక నేతలు వెళ్లిపోతున్నారని వార్తలు వచ్చాయి. అయితే మహానాడు అయిపోయింది కానీ అటువంటిది ఏమీ జరగలేదు. వారిని తమ వైపునకు తిప్పుకునేందుకు అధికారపార్టీ ప్రయత్నించింది. కారణాలు ఏమైనప్పటికీ వారు పార్టీ మారలేదని సమాచారం.

అయితే ఇప్పుడు వారిని దారికి తెచ్చుకోవడానికి అధికార పక్షం తనదైన శైలిలో ప్రయత్నాలు చేస్తుందని ఆంధ్రజ్యోతి కథనం. గ్రానైట్‌ రంగంలో ఉన్న టీడీపీ నేతలే లక్ష్యంగా వివిధ యజమానులకు భారీ జరిమానాలు విధించిన ప్రభుత్వం తాజా ముగ్గురు టీడీపీ నేతల గ్రానైట్‌ పర్మిట్లను నిలిపివేసిందని ఆ వార్త సారాంశం.

గ్రానైట్‌ రంగంలో ఉన్న ఎమ్మెల్యే రవికుమార్‌, మాజీమంత్రి శిద్దా, మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావును టార్గెట్‌ చేయడంతో వారి ఆర్థిక మూలాలను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అర్ధం అవుతుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆ ముగ్గురికీ భారీనష్టం జరిగే అవకాశం లేక పోలేదు. ఇప్పుడు ఆ నేతలకు న్యాయ పోరాటం చెయ్యడమో లేక ప్రభుత్వానికి సరెండర్ అయిపోవడమో తప్ప వేరే మార్గం లేదని అంటున్నారు.

ఏది ఏమైనా ప్రభుత్వం రాజకీయ కోణంలో ప్రత్యర్థుల ఆర్థికమూలాలను దెబ్బతీసే చర్యలకు ఉపక్రమించడంతో తెలుగుదేశం నేతలకు మునుముందు ఇబ్బందే అని చెప్పుకోవాలి. అసలే ఘోరపరాజయంతో సతమతం అవుతున్న తరుణంలో ఆర్ధిక ఇబ్బందులు కూడా ఎదురైతే పార్టీని అంటిపెట్టుకుని ఉండగలరా అనేది అసలు ప్రశ్న.