jagan government over action on local body electionsఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికలు వాయిదా వెయ్యగానే ఆకాశం బద్దలైనంత హుంగామా చేసింది అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా మీడియా ముందుకు వచ్చి ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద విరుచుకుపడ్డారు. కుల రంగు పూశారు. చంద్రబాబు తొత్తు అన్నారు.

అసలు కరోనా అనేది పెద్ద విషయమే కాదు అన్నట్టు మాట్లాడారు. ఆ తరువాత పార్టీలోని వంది మాగధులు అందుకుని రమేష్ కుమార్ ని బూతులు తిట్టినంత పని చేశారు. అయితే ఇప్పుడు అది ఏకంగా దేశాన్నే ఇంట్లో ఉండేలా చేసింది. ఎన్నికల తరువాత జగన్ పరువు తీసిన అంశం ఏదైనా ఉంటే ఇది అదే అనడం లో ఎటువంటి సందేహం లేదు.

దానికి స్థానిక సంస్థల నిధులు ఆగిపోతాయి ఎన్నికలు జరగకపోతే అనే కలరింగ్ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. అయితే కరోనా అనేది సీరియస్ విషయం కావడంతో ప్రజలు ఆ కారణాన్ని కూడా హర్షించలేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌కు బకాయి ఉన్న నిధుల్లో 1301.23 కోట్లను కేంద్ర ప్రభుత్వం శనివారం విడుదల చేసింది.

గ్రామీణ ప్రాంతాలకు 2018-19 ఆర్థిక సంవత్సరం రెండో విడతగా అందాల్సిన రూ.870.23 కోట్లు… పట్టణ స్థానిక సంస్థలకు 2019-20 సంవత్సరపు తొలి విడత వాయిదా రూ.431 కోట్లను ఇచ్చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించని అరుణాచల్‌ ప్రదేశ్‌, మేఘాలయ, ఒడిసా, తమిళనాడు రాష్ట్రాలకూ ఆయా ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన ఒక విడత నిధులు రూ.5140 కోట్లను కేంద్రం మంజూరు చేసింది.

కరోనా ముప్పు నేపథ్యంలో స్థానిక సంస్థల్లో తీసుకోవాల్సిన పారిశుధ్య చర్యల కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనితో ఎన్నికలు జరపడానికి రాజకీయ కారణాలు తప్ప అధికార పార్టీ ఎటువంటి సహేతుకమైన కారణాలు తెలపలేకపోయింది అనేది స్పష్టం అయ్యింది. ఈ మొత్తం విషయంలో ప్రభుత్వం తన పరువు పోగొట్టుకోవడం తప్ప సాధించింది ఏమీ లేదు.