Jagan government on ssc examinationsఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎట్టకేలకు పదవ తరగతి మరియు ఇతర పరీక్షలు వాయిదా వెయ్యడానికి నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31న మొదలయ్యే పరీక్షలు రెండు వారాల పాటు వాయిదా వేస్తున్నామని, ఆ తరువాత పరిస్థితిని బట్టి కొత్త షెడ్యూల్ ప్రకటిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ మంచి నిర్ణయం తీసుకుందని చెప్పాలి.

రాష్ట్రమంతా లాక్ డౌన్ ప్రకటించిన నాడు కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరీక్షలు యధావిధిగా జరుగుతాయని చెప్పుకొచ్చారు. దానిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. పక్క రాష్ట్రంలో హైకోర్టు సుమోటోగా తీసుకుని పరీక్షలు వాయిదా వేయించిందని విలేఖరులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చినా ఆయన సమాధానం చెప్పకుండా సమావేశం నుండి వెళ్ళిపోయారు.

ఆలస్యంగా తీసుకున్నా మంచి నిర్ణయం తీసుకున్నారనే చెప్పుకోవాలి. అయితే ఏదైనా ఒక నిర్ణయం సరైన సమయంలో తీసుకోకుండా, ఆ తరువాత నాలుక కరుచుకుని మార్చుకోవడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సర్వసాధారణం అయిపోయింది. అప్పట్లో ఎన్నికలు జరపాలని కూడా ప్రభుత్వం ఇలాగే వాదించింది. ఇది ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటివరకు ఏడు కరోనా కేసులు నమోదు అయ్యాయి.

తెలంగాణాలో ఈరోజు ఉదయం మరో మూడు కేసులు నమోదయ్యి, టోటల్ సంఖ్య 36కు చేరింది. దేశవ్యాప్తంగా ఆ సంఖ్య 500కు దరిదాపుల్లో ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికే ఈ నెల 31వరకు పూర్తి స్థాయి లాక్ డౌన్ ప్రకటించాయి. దేశవ్యాప్తంగా 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పూర్తిగా లాక్ డౌన్ ప్రకటించాయి.