Chandrababu Naiduకృష్ణా నదికి వరద తాకిడి ఎక్కువ కావడంతో కరకట్ట రాజకీయం మళ్ళీ తెరమీదకు వచ్చింది. చంద్రబాబు నివాసం వుంటోన్న ఇల్లు సహా, కరకట్టను ఆనుకుని వున్న అనేక నిర్మాణాలకు మళ్ళీ నోటీసులు వెళ్ళాయి. వరద వచ్చే అవకాశం వుంది గనుక, ఖాళీ చేయాలని నోటీసుల సారాంశం. ఆ వెనుకనే వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు మీద విమర్శలు చెయ్యడం మొదలుపెట్టారు.

“కృష్ణానదికి వరద వస్తోంది. ఇకనైనా చట్టాన్ని గౌరవించి ఉండవల్లిలో అక్రమంగా కట్టిన గెస్ట్‌హౌస్‌ను ఖాళీచేయండి చంద్రబాబు నాయుడు. కోర్టులద్వారా రక్షణపొందినా, ప్రభుత్వాన్ని అడ్డుకోవాలని చూసినా, పై నుంచి వచ్చిన వరద మీ ఇంటిని ముంచివేయక మానదు,” అంటూ హెచ్చరించారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.

గత కొంత కాలంగా చంద్రబాబు ఆ ఇంట్లో ఉండటం లేదు. కరోనా వచ్చిన నాటి నుండీ కుటుంబంతో హైదరాబాద్ నుండే ఉంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు ఇంట్లోకి వరద వస్తుందని వారు ఆందోళన చెందనవసరం లేదు. అక్రమ కట్టడాలు కూల్చి వేస్తాం అంటూ ప్రగల్బాలు పలికి కేవలం ప్రజావేదికతో మాత్రమే ఆగిపోయారు.

అప్పటి నుండి ఆ దిశగా ఒక్క అడుగు కూడా వెయ్యలేదు. బహుశా ఆ కారణంగానే ఈ సారి ఇచ్చిన నోటిసులలో ఇదివరకటిలా కూల్చేస్తామని కాకుండా వరద వస్తోంది ఖాళీ చెయ్యండి అని మాత్రమే నోటీసులు ఇచ్చిన్నట్టున్నారు. ఇది ఇలా ఉండగా… ఆంధ్రప్రదేశ్ లో దేవాలయాల మీద జరుగుతున్న దాడుల గురించి వస్తున్న విమర్శలు ఎదురుకోలేక ప్రజల దృష్టిని మరలించడానికే మళ్ళీ దీనిని తెరమీదకు తెచ్చారు అంటున్నారు టీడీపీ వారు.