jagan government new disticts in andhra pradeshపరిపాలన సౌలభ్యం కోసమే 13 జిల్లాలుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ను 26 జిల్లాలుగా పునర్ వ్యవస్తీకరణ అంటూ ముందుకెళ్తున్న జగన్ ప్రభుత్వంపై విపక్ష పార్టీల నుండి ప్రశ్నలు., విమర్శలు మొదలయ్యాయి. జిల్లాల వికేంద్రీకరణ ప్రక్రియలో ప్రజాభిష్టానికి ఏ మాత్రం విలువ లేకుండా పాలకుల చిత్తానికి తోచినట్లు ముందుకు వెళ్లారని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విమర్శించారు.

ఈ విభజన లోపభూయిష్టంగా సాగిందని., పార్లమెంట్ నియోజకవర్గమే ప్రామాణికం అంటూ ప్రజల మనోగతాన్ని పరిగణలోకి తీసుకోకుండా., ప్రభుత్వం జిల్లాల పునర్ వ్యవస్తీకరణకు శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. కొత్త జిల్లా ఏర్పాటు వలన ప్రజలు ఎదుర్కుంటున్న ఇబ్బందులను తెలుసుకోకుండా జగన్ ఈ నిర్ణయాన్ని ప్రజల పై ఎలా రుద్దుతారంటూ పవన్ ప్రశ్నించారు.

సుదీర్ఘ కాలంగా జిల్లా డిమాండ్ ఉన్న ప్రాంతాలపై కనీస అధ్యయనం కూడా చేయకుండా., ప్రభుత్వం తమ రాజకీయ లబ్ది కోసమే ఇటువంటి కార్యక్రమాలకు ఆహ్వానం పలుకుతుంది అన్నారు. పాడేరు కేంద్రంగా ఏర్పాటు చేసిన జిల్లాతో పోలవరం ముంపు మండలాలలో ఉండే గిరిజనులకు అనేక ఇబ్బందు తలెత్తాయన్నారు. రంపచోడవరం జిల్లా కేంద్రంగా ఉండాలన్న గిరిజనుల మనోగతాన్ని ప్రభుత్వం విస్మరించిందన్నారు.

ఎటపాక, కుక్కునూరు లాంటి మండలాల ప్రజలు జిల్లా కేంద్రాలకు వెళ్లాలంటే కనీసం మూడు వందల కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తుందని కూడా తెలుసుకోలేని పరిస్థితులలో ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయని పవన్ ధ్వజమెత్తారు. ఈ తరహా విభజనతో ప్రజలకు పాలన ఏవిధంగా చేరువ చేస్తారో? వివరణ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. మదనపల్లె., హిందూపురం., మార్కాపురం కేంద్రాలుగా మార్చాలంటూ డిమాండ్లున్నాయి. లోపాలు, అసౌకర్యాలపై ప్రజల నిరసనలకు జనసేన అండగా ఉంటుందన్నారు.

ఇదిలా ఉంటే…., ప్రభుత్వం ‘పాలనా సౌలభ్యం’ ఆధారంగా కాకుండా ‘కులాల ప్రాతిపదిక’ కేంద్రంగా జిల్లాల పునర్ వ్యవస్తీకరణ జరిగిందంటూ రాజకీయ వర్గాలలో జోరుగా ప్రచారం ఊపందుకుంది. కమ్మ, కాపు, బలిజలు, బీసీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను టార్గెట్ చేసేలా జిల్లాల విభజన రూపొందిందనే వాదన లేకపోలేదు.

రాబోయే 2024 ఎన్నికలే లక్ష్యంగా ., ఓట్ల విభజనే ప్రధానోద్దేశంగా జిల్లాల విభజన జరిగిందనేది రాజకీయ నాయకుల ఆంతరంగిక చర్చలలో వినపడుతున్న మాట. జగన్ ఓటమి భయంతోనే ఈ జిల్లా పునర్ వ్యవస్తీకరణకు అంకురార్పణ చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత తులసి రెడ్డి వాపోయారు.

ప్రజల బాగోగులు కాదు., వైసీపీ నాయకుల గెలుపోటములను దృష్టిలో ఉంచుకొని జగన్ రెడ్డి తన సామాజిక వర్గంవారి ప్రాభల్యం పెంచుకోవడానికే ఈ ఎత్తుగడలు వేశారని టీడీపీ నేతలు ప్రభుత్వ నిర్ణయం పై మండిపడుతున్నారు. ప్రభుత్వానికి ప్రజల మీద ప్రేమ., పాలన పై పట్టు., ప్రజాభిష్టానానికి విలువనిచ్చే రాజకీయాలు చేస్తే ఈ వీకేంద్రకరణ – కేంద్రీకరణ అనే విధానాలతో పనిలేకుండా ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరువచేయవచ్చు అనేది సామాన్యుడి ఆలోచన.