ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ప్రభుత్వం విద్యావ్యవస్థపై చేస్తున్న ప్రయోగాలతో ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లితండ్రులు అందరూ హడలిపోతున్నారు. ఇప్పుడు ప్రైవేట్ పాఠశాలల వంతు వచ్చింది. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ పాఠశాలలలో 25 శాతం సీట్లు నిరుపేద విద్యార్థులకు కేటాయించవలసిందిగా జగన్ ప్రభుత్వం హుకుం జారీ చేసింది. అంతేకాదు.. నేటి నుంచి ఆన్‌లైన్‌లో విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది.
వీటిలో ఆనాధలు, దివ్యాంగులు, హెచ్‌ఐవీ బాధిత పిల్లలకు 5 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 4 శాతం, బీసీ, మైనార్టీ, ఓసీ వర్గాలకు 6 శాతం సీట్లు కేటాయిస్తారు. పట్టణ ప్రాంతాలలో వార్షికాదాయం రూ.1.4 లక్షలు, గ్రామీణ ప్రాంతాలలో రూ.1.4 లక్షలు వార్షికాదాయం ఉన్నవారి పిల్లలు ఈ పధకానికి అర్హులు.
ముందుగా నేటి నుంచి ఈ నెల 30వరకు ఒకటవ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరించి లాటరీ పద్దతిలో సీట్లు కేటాయిస్తుంది ప్రభుత్వం. సెప్టెంబర్ 2న ప్రైవేట్ పాఠశాలలలో ప్రవేశాలకు అర్హత పొందిన విద్యార్థుల జాబితా ప్రకటిస్తుంది. ఒకవేళ ఇంకా సీట్లు మిగిలిపోతే ఆదేరోజు నుంచి రెండో విడత దరఖాస్తుల స్వీకరణ ప్రారంభిస్తుంది. ఇకపై ప్రతీ ఏడాది ఇదే పద్దతిలో 1వ తరగతి విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలలలో ప్రవేశాలు కల్పిస్తుంది.
ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చి దిద్దేందుకు ప్రభుత్వం నాడు-నేడు పేరిట కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టింది. విద్యార్థుల సౌలభ్యం కోసం తెలుగు-ఇంగ్లీష్ రెండు భాషలలో పుస్తకాలు అచ్చు వేయించింది. పిల్లలకు పుస్తకాలు, స్కూలు బ్యాగులు, పుస్తకాలు, బూట్లు ఇస్తోంది. బైజూ కంపెనీతో ఒప్పందం చేసుకొంది. త్వరలో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్స్ ఇవ్వబోతోంది. పిల్లల తల్లులకు అమ్మఒడి, విద్యా దీవెన పేరిట వందల కోట్లు ఇస్తోంది. వీటితో ప్రభుత్వ పాఠశాలలలో విద్యాప్రమాణాలు గణనీయంగా పెరుగబోతున్నాయని సిఎం జగన్మోహన్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పదేపదే చెపుతున్నారు. మరి పేద విద్యార్థులను ప్రైవేట్ పాఠశాలలకు ఎందుకు పంపిస్తున్నట్లు?
ప్రైవేట్ పాఠశాలలలో 25 శాతం సీట్లు పేద విద్యార్థులకు కేటాయిస్తే అవి ఆ మేరకు నష్టపోతాయి. కనుక ఆ విద్యార్థుల పట్ల అంతే శ్రద్ద చూపుతాయా?చూపకపోతే ఆ పసిపిల్లల పరిస్థితి ఏమిటి?అయినా ప్రైవేట్ పాఠశాలలలో మద్యతరగతి ఆపై స్థాయి విద్యార్థులే ఎక్కువగా ఉంటారు. వారితో పేద విద్యార్థులు ఇమడగలరా?
ప్రభుత్వం విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలనుకొంటే ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా ముందుగా ఆ రంగంలో మేధావులు, విద్యావేత్తలు, ఉపాధ్యాయులతో సంప్రదించి తీసుకొంటే మంచి ఫలితాలు వస్తాయి. కానీ ప్రభుత్వం గొప్పకు పోయి ఇటువంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకొంటూ విద్యార్థుల జీవితాలతో ప్రయోగాలు చేయడం ఏమాత్రం మంచిది కాదని విద్యావేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.