Jagan Government Blames Brahma Reddy for YSRCP TDP Clash in Macherlaపల్నాడు జిల్లాలో మాచర్ల పట్టణంలో టిడిపి నియోజకవర్గం ఇన్‌ఛార్జ్‌ జూలకంటి బ్రహ్మారెడ్డి ఇంటిపై శుక్రవారం రాత్రి వైసీపీ కార్యకర్తలు దాడి చేసి ఇంటికి, అక్కడ పార్క్ చేసి ఉన్న వాహనాలకి నిప్పు పెట్టారు. అంతకు ముందు శుక్రవారం సాయంత్రం మాచర్ల పట్టణంలో జూలకంటి బ్రహ్మారెడ్డి అధ్యర్యంలో ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి? నిరసన ర్యాలీకి టిడిపి శ్రేణులు బయలుదేరగా వారిని వైసీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఇరువర్గాలకు మద్య ఘర్షణ జరిగింది. ఈ దాడులతో శుక్రవారం సాయంత్రం నుంచి మాచర్ల పట్టణం అట్టుడుకుతోంది.

చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొన్నట్లు నిన్న ఇంత విధ్వంసం జరుగుతుంటే స్పందించి అడ్డుకోలేకపోయిన పోలీసులు నేడు మాచర్లలో కర్ఫ్యూ విధించి ఎక్కడికక్కడ భారీగా పోలీసులని మోహరించి మళ్ళీ ఎటువంటి ఆవంచనీయ ఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొంటున్నారు.

ఈ ఘటనలో టిడిపి కార్యకర్తలని అరెస్ట్ చేయడంపై చంద్రబాబు నాయుడు, రాష్ట్ర టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో సహా పలువురు టిడిపి నేతలు తీవ్రంగా ఖండించారు. అయితే ఎప్పటిలాగే ఈ ఘటనలకి టిడిపియే కారణమని పల్నాడు ఎస్పీ రవిశంకర్ తేల్చి చెప్పేశారు. నిన్న జరిగిన దాడులు, విధ్వంసంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కొందరు ఫ్యాక్షనిస్టులు కూడా ఉన్నట్లు గుర్తించామని, కనుక ఇది ఓ పద్దతి ప్రకారం జరిగిన కుట్రగానే భావిస్తున్నామని అన్నారు. రాజకీయ పార్టీల అండదండలతోనే ఫ్యాక్షనిస్టులని ఇంతగా చెలరేగిపోయారని అన్నారు. వెల్దుర్తి మండలంలో జరిగిన కొన్ని హత్యలతో సంబంధం ఉన్న ఫ్యాక్షనిస్టులు రాడ్లు, కర్రలు, బండలతో దాడులకి తెగబడ్డారని అన్నారు.

టిడిపి శ్రేణులు రెచ్చగొట్టడంతోనే ఈ ఘర్షణలు ప్రారంభం అయ్యాయని అన్నారు. ఈ గొడవల వెనుక ఎవరున్నప్పటికీ అందరినీ అరెస్ట్ చేసి తీరుతాము. మాచర్లలోకి బయట నుంచి కొత్తవారు ఎవరూ రాకుండా పోలీసులని మోహరించి నిఘా పెట్టాము. పరిస్థితులు చల్లబడే వరకు రాజకీయ నాయకులు ఎవరూ మాచర్లలో పర్యటనలకి రావద్దని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.

రాష్ట్రంలో కోనసీమలో దాడులు జరిగినప్పుడు, ఆ తర్వాత కుప్పంలో దాడులు జరిగియనప్పుడూ టిడిపియే దోషి అని ముందుగా వైసీపీ నేతలు ప్రకటిస్తారు. ఆ తర్వాత సాక్షి మీడియా, దాని తర్వాత పోలీస్ ఉన్నతాధికారులు అదే తీర్మానించడం పరిపాటిగా మారింది. కనుక మాచర్లలో కూడా అదేవిదంగా తేల్చిపడేశారు. జూలకంటి బ్రహ్మారెడ్డి వాహనాలను, ఇంటిని కూడా టిడిపి తగులబెట్టించిందని చెప్పేస్తే ఇక్కడితో ఈ కధ ముగించేసినట్లయ్యేది కదా?