jagan government approches supreme court వైసీపీలో అందరూ జాతిరత్నాలు.. కడిగిన ముత్యాలు.. మహా మేధావులే. కానీ మూడు రాజధానుల ప్రతిపాదన అమలుచేయడంలో సాధకబాధకాలు గ్రహించకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అందుకే మూడేళ్ళయినా ఇంతవరకు ఆ నిర్ణయాన్ని అమలుచేయలేకపోయింది. ఈ ఏడాది మార్చిలో రాజధానై అంశంపై హైకోర్టు విస్పష్టమైన తీర్పు చెప్పింది.

హైకోర్టు మార్చిలో ఇచ్చిన ఆ తీర్పులో ఓ విశేషముంది. హైకోర్టు తనకున్న విచక్షణాధికారాలను ఉపయోగించుకొని ‘రిట్ ఆఫ్ మాండమాస్’ తీర్పు ఇచ్చింది. అంటే ఏ ప్రభుత్వామైనా తీసుకొనే నిర్ణయాలు ప్రజలకు మేలుచేయవని న్యాయస్థానం భావించినపుడు మాత్రమే ‘రిట్ ఆఫ్ మాండమాస్’ తీర్పునిస్తాయి. న్యాయస్థానాలు చాలా అరుదుగా ఈ ప్రకారం తీర్పు చెపుతాయి.

మూడు రాజధానులపై స్టే విధించి ఆర్నెల్లలోపుగా రాజధాని రైతులందరికీ సీఆర్‌డీఏ చట్టంలో పేర్కొన్న ప్రకారం భూములు, పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలని ఆదేశించింది. తక్షణం అమరావతిలో నిర్మాణ పనులు ప్రారంభించి, ఎప్పటికప్పుడు హైకోర్టుకి నివేదికలు ఇవ్వాలని ఆదేశించింది. రాజధానిలో భూములు అమ్ముకోవడం, తనఖా పెట్టడం లేదా వేరే అవసరాలకు కేటాయించడం గానీ చేయరాదని స్పష్టంగా పేర్కొంది. అన్నిటికీ మించి రాజధాని విషయంలో ప్రభుత్వానికి శాసనసభలో చట్టం చేసే అధికారం లేదని, సీఆర్‌డీఏ చట్టం ప్రకారం అమరావతినే రాజధానిగా ఉంచాలని హైకోర్టు విస్పష్టంగా చెప్పింది.

అప్పుడు అన్నిటికీ తల ఊపి బయటపడిన జగన్ సర్కార్, ఆ తర్వాత ఆర్నెలలో రాజధాని కట్టలేమని, కనీసం ఆరేళ్ళు పడుతుందని, రాజధాని నిర్మించేందుకు నిధులు కూడా లేవని అఫిడవిట్ దాఖలు చేసింది. అంటే అమరావతి కట్టడానికి అభ్యంతరం లేదు కానీ ఇప్పటికిప్పుడు కట్టలేమని చెప్పినట్లే కదా?

కానీ జగన్ సర్కార్‌కి అమరావతిని నిర్మించే ఉద్దేశ్యం లేదని ముందే స్పష్టమైపోయింది. కనీసం మూడు రాజధానుల విషయంలోనైనా దానికి చిత్తశుద్ధి ఉందా లేదా?అనే అనుమానం కలుగుతోంది. ఎందుకంటే హైకోర్టు ఈ తీర్పు ఇచ్చి ఆర్నెల్లు అవుతోంది. ఇంతకాలం కాలక్షేపం చేసిన జగన్ సర్కార్‌ ఇప్పుడు హైకోర్టు తీర్పుని సుప్రీంకోర్టులో సవాల్ చేసింది!

ప్రభుత్వానికి చట్టాలు చేసే అధికారం లేదని హైకోర్టు చెప్పడాన్ని తప్పు పట్టింది. ఇది శాసనసభ, పరిపాలన వ్యవహారాలలో హైకోర్టు జోక్యం చేసుకోవడమేనని పిటిషన్‌లో పేర్కొంది. కనుక హైకోర్టు విధించిన స్టేను రద్దు చేయాలని జగన్ సర్కార్‌కి సుప్రీంకోర్టుని కోరింది.

సుప్రీంకోర్టు స్టే ఎత్తివేస్తే అప్పుడు శాసనసభలో మళ్ళీ మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ సుప్రీంకోర్టు నిరాకరిస్తే ఏం చేస్తుంది?దీనిపై సుప్రీంకోర్టు విచారణకు సమయం తీసుకొంటే ఏం చేస్తుంది?ఎప్పుడు తన ప్రతిపాదనను అమలుచేస్తుంది?అనే ప్రశ్నలకు బహుశః జగన్ సర్కార్‌ వద్ద జవాబులు ఉండకపోవచ్చు.

అంటే జగన్ సర్కార్‌కి మూడు రాజధానుల విషయంలో కూడా చిత్తశుద్ధి లేనందునే ఈవిదంగా కాలక్షేపం చేస్తోందనే అనుమానం కలుగుతోంది.