jagan government ap online tickets      ప్రభుత్వాలు పాలనకు మాత్రమే పరిమితమైతే చాలని కేంద్రప్రభుత్వం భావిస్తోంది. కానీ జగన్ సర్కార్ ఇందుకు పూర్తి భిన్నంగా ప్రతీ రంగంలో వేలుపెడుతోంది. దాంతో అంతవరకు సజావుగా సాగుతున్న ఆయా రంగాలన్నీ అస్తవ్యస్తంగా మారుతున్నాయి.

ఏపీలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలుచేస్తాం అంటూ ప్రభుత్వమే వైన్ షాపులు నిర్వహించడం మొదలుపెట్టింది. వాటి దగ్గర ఉపాధ్యాయులకు డ్యూటీలు వేసి తీవ్ర విమర్శలపాలైంది. ప్రభుత్వానికి మద్యం అమ్మకాలు సాగింఛాల్సిన బాధ్యత కూడా ఉందా? అందుకే దానిని ప్రజలు ఎన్నుకొన్నారా?అని సామాన్యుల సందేహాలకు జవాబు దొరకదు.

రాష్ట్రంలో పాలనకు మున్సిపల్, రెవెన్యూ, పంచాయతీ వ్యవస్థలున్నాయి. విశ్వామిత్రుడు సృష్టికి ప్రతిసృష్టి చేసినట్లు జగన్ సర్కార్ వాటికి ప్రత్యామ్నాయంగా సచివాలయ వ్యవస్థలను సృష్టించడంతో గందరగోళంగా మారింది.

విద్యా వ్యవస్థ ప్రక్షాళన పేరుతో ఉపాధ్యాయుల సంఖ్యను కుదించే ప్రయత్నం చేస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులు ఆందోళనబాట పట్టారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు మీడియం, ఇప్పుడు బైజూస్ విద్యాబోధనా విధానం ప్రవేశపెట్టడంతో విద్యారంగంలో ఆందోళన మొదలైంది.

ఇవన్నీ సరిపోవన్నట్లు, సినిమా టికెట్ల విక్రయాన్ని తన చేతుల్లోకి తీసుకొంది. ఇకపై రాష్ట్రంలో సినిమా థియేటర్లన్నీ ఏపీ స్టేట్‌ ఫిల్మ్, టీవీ, థియేటర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎస్‌ఎఫ్‌టీవీటీడీసీ) ద్వారా ఏర్పాటవుతున్న ఆన్‌లైన్‌ విధానంలోనే టికెట్లు అమ్ముకోవలసి ఉంటుందని ఉత్తర్వులు జారీ చేసింది. జూలై మొదటివారంలోగా రాష్ట్రంలో సినిమా థియేటర్ల యజమానులు అందరూ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని హుకుం జారీ చేసింది.

ఈ విధానంలో థియేటర్ యజమానులు 1.95 శాతం సర్వీసు ఛార్జీ రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించవలసి ఉంటుంది. ప్రేక్షకుల నుంచి నేరుగా థియేటర్లకు వచ్చే ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తన చేతిలోకి తీసుకోవడంతో ఇకపై రాష్ట్రంలో థియేటర్ల యజమానులు ప్రభుత్వం దయాదాక్షిణ్యాలపై ఆధారపడక తప్పదు. దీంతో థియేటర్లు దివాళా తీస్తే వాటి యజమానులు ఎలాగూ నష్టపోతారు. వారితో పాటు థియేటర్లపైనే ఆధారపడి జీవిస్తున్న వేలాదిమంది ఉద్యోగులు రోడ్డున పడతారు. థియేటర్లు కళకళలాడుతుంటేనే సినీ పరిశ్రమ కూడా కళకళలాడుతుంది. కనుక థియేటర్లు నష్టపోతే ఆ ప్రభావం సినీ పరిశ్రమపై దానిలో పనిచేస్తున్న వేలాది నిపుణులు, కార్మికులు, ఆర్టిస్టులపై తీవ్రంగా పడుతుంది.

అదనపు ఆదాయం కోసం, రాజకీయ కారణాలతోను జగన్ సర్కార్ ఇలా ఒక్కో రంగంలో వేలుపెడుతూ వాటిని అస్తవ్యస్తం చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయినా మూడేళ్ళ వయసున్న మా కుందేలుకి మూడే కాళ్ళు అని సాగిపోతోంది.