Police_Case_Nara_Lokesh_Yuva_Galam_Padayatraటిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర గురించి టిడిపి చేసుకొంటున్న ప్రచారం కంటే, పోలీసులతో దానిని అడ్డుకొనేందుకు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల వల్లనే ఎక్కువ పబ్లిసిటీ లభిస్తోంది. ఒకవేళ వైసీపీ ప్రభుత్వం యువగళం పాదయాత్రని అడ్డుకొనే ప్రయత్నం చేయకపోయుంటే నారా లోకేష్‌ ఈ 14 రోజులలో మరిన్ని గ్రామాలలో పాదయాత్ర పూర్తిచేసుకొని ముందుకు సాగుతుండేవారు. కానీ జీవో నంబర్:1 పేరుతో పోలీసులు అడుగడుగునా నారా లోకేష్‌ని అడ్డుకొంటుండటంతో మెల్లగా సాగుతోంది. కనుక ప్రతీ గ్రామంలో ప్రజలతో ఎక్కువ సమయం గడుపగలుగుతున్నారు. ప్రజలు కూడా నారా లోకేష్‌ని కలిసి తమ సమస్యలని చెప్పుకోగలుగుతున్నారు. నారా లోకేష్‌ ఇంకా చిత్తూరు జిల్లాలోనే పాదయాత్ర చేస్తున్నారు. దీని వలన టిడిపికి ముఖ్యంగా నారా లోకేష్‌కి లాభం కలుగుతుందని వేరే చెప్పక్కరలేదు.

ఇక నారా లోకేష్‌ని అడుగడుగునా పోలీసులు ఏవిదంగా అడ్డుకొంటున్నారో ఆయా గ్రామాలలో ప్రజలతో పాటు, ప్రసార మాద్యమాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కూడా చూస్తున్నారు. ప్రతిపక్ష నేతలని రోడ్లపైకి రానీయకుండా, ప్రజలతో కలవనీయకుండా అడ్డుకొనేందుకే వైసీపీ ప్రభుత్వం జీవో నంబర్:1 తెచ్చిందని టిడిపి, జనసేన వాదనలు నిజమేనని ప్రజలు కూడా గ్రహిస్తున్నారు.

ఈ 14 రోజులలోనే ఒక్క చిత్తూరు జిల్లాలోనే నారా లోకేష్‌పై 5 పోలీస్ కేసులు నమోదయ్యాయి. కానీ పోలీసుల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ టిడిపి ఇంతవరకు కోర్టులని ఆశ్రయించలేదు. జీవో నంబర్:1ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న టిడిపి, దానికి అవసరమైన బలమైన సాక్ష్యాధారాలని సేకరించిన తర్వాత రాబోయే రోజుల్లో తప్పకుండా హైకోర్టు దృష్టికి తీసుకువెళ్ళడం ఖాయం. అప్పుడు హైకోర్టు పోలీసులకి, ప్రభుత్వానికి మొట్టికాయలు వేయడం ఖాయం.

ఈరోజు సంసిరెడ్డిపల్లెలో పోలీసులు అడ్డుకొన్నప్పుడు నారా లోకేష్‌ భారత రాజ్యాంగం పుస్తకాన్ని చూపిస్తూ ‘దీని ప్రకారం తన హక్కులని కాపాడుకొంటానని, పోలీసులని కూడా రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలని హెచ్చరించడం గమనిస్తే, రేపు కోర్టులో ఇటువంటి బలమైన సాక్ష్యాలని చూపి పోరాడవచ్చని స్పష్టం అవుతోంది. కానీ వైసీపీ ప్రభుత్వం, పోలీసులు ఇదేమీ గ్రహించకుండా అడ్డుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు.

యువగళం పాదయాత్రలో నారా లోకేష్‌ ఆయా జిల్లాల మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలపై విమర్శిస్తూ ముందుకు సాగుతున్నారు. కనుక వైసీపీలో శక్తివంతమైన నేతలున్న జిల్లాలో నారా లోకేష్‌ని అడ్డుకొని, ముందుకుసాగనీయకుండా చేసేందుకు గట్టి ప్రయత్నాలు చేయవచ్చు. కనుక నారా లోకేష్‌ పాదయాత్రకి అడుగడుగునా వైసీపీ నేతలు, పోలీసుల నుంచి సవాళ్ళు, సమస్యలు తప్పకపోవచ్చు.

అయితే నారా లోకేష్‌ని అడ్డుకొనేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రదర్శిస్తున్న అత్యుత్సాహం ప్రజలకి తప్పుడు సంకేతాలు పంపిస్తోందని గ్రహించిన్నట్లు లేదు. ఇప్పటికే టిడిపి, జనసేనలు ఎక్కడ పొత్తులు పెట్టుకొంటాయో అని బెంగపెట్టుకొంటున్న వైసీపీకి నారా లోకేష్‌ పాదయాత్రతో అభద్రతాభావం మరింత పెరిగిన్నట్లనిపిస్తోంది. రాబోయే 385 రోజులూ ప్రతీరోజూ పోలీసులు, వైసీపీ నేతలు ఈవిదంగా హడావుడి చేస్తుంటే నారా లోకేష్‌ పాదయాత్రకి టిడిపి కంటే వైసీపీయే ఎక్కువ పబ్లిసిటీ చేసినట్లే కదా? ఇందుకు టిడిపి, నారా లోకేష్‌ కూడా సిఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుకోవలసిందే!