YS- Jagan_KCRతెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్ అధికారంలో ఉన్న నాటి నుండీ ప్రతిపక్షాలను గాడిలో పెట్టడానికి ఒక వ్యూహం అనుసరించారు. ప్రతిపక్షం సభలో తోక జాడిస్తే వెంటనే సభ నుండి సస్పెండ్ చేసేవారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే వ్యూహాన్ని అనుసరిస్తుంది. ప్రస్తుతం కొనసాగుతున్న బడ్జెట్ సెషన్ లో ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన అధికార పక్షం, ఈరోజు మరో నలుగురు తెలుగుదేశం ఎమ్మెల్యేలను ఈరోజు సస్పెండ్ చేసింది.

సభా కార్యకలాపాలకు అడ్డుతగులుతున్నారనే కారణంతో తెలుగుదేశం ఎమ్మెల్యేలు బెందాళం అశోక్‌, వాసుపల్లి గణేశ్‌కుమార్‌, వెలగపూడి రామకృష్ణ బాబు, బాల వీరాంజనేయ స్వామిని సస్పెండ్‌ చేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు. నదీ జలాల పంపకంపై సభలో చర్చ జరుగుతున్న సందర్భంలో ప్రతిపక్ష సభ్యులు నిరసనకు దిగారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగిస్తుండగా ఎమ్మెల్యేలు సభకు ఆటంకం కలిగించారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంయుక్తంగా నిర్మించతలపెట్టిన ప్రాజెక్టు ఆంధ్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుందని వారు ఆరోపించారు.

దీనితో ప్రభుత్వం ఆగ్రహించి వారిని సస్పెండ్ చేసింది. వారంతా సభ నుంచి వెళ్లాలని స్పీకర్‌ సూచించినప్పటికీ ఫలితం లేకపోవడంతో మార్షల్స్‌ సాయంతో వారిని బయటకు పంపించారు. ఈ రోజు సభ ముగిసేవరకు స్పీకర్‌ ఈ నలుగురినీ సస్పెండ్‌ చేశారు. అయితే మొన్న సస్పెండైన సభ్యులు మాత్రం పూర్తి సెషన్ పాటు సస్పెండ్ అయ్యారు. ఇదిలా ఉంటే మైక్‌ అడిగితే ఇవ్వనందుకు నిరసనగా చంద్రబాబు సహా మిగతా టీడీపీ సభ్యులు కూడా సభ నుంచి వాకౌట్‌ చేశారు.