Jagan Flex Bannersసిఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వైసీపీ నేతలకి, కార్యకర్తలకి పండుగవంటిదే కావచ్చు. కానీ అదేదో రాష్ట్ర పందుగో లేదా జాతీయ దినోత్సవమో అన్నట్లు కోట్లాది రూపాయలు ఖర్చు చేసి రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో నిర్వహించడాన్ని అందరూ తప్పు పడుతున్నారు. ఓ పక్క ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులు జీతాలు కూడా చెల్లించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంత దుబారా, హడావుడి అవసరమా?అని ప్రశ్నిస్తున్నారు. ఇంత ఆర్భాటంగా సిఎం జగన్‌ పుట్టినరోజు నిర్వహించిన తర్వాత సకాలంలో జీతాలు ఇవ్వకపోతే అందరూ ఏమంటారో అనే భయం కూడా లేన్నట్లు అంగరంగ వైభవంగా నిర్వహించారు.

ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే విశాఖలో ఆంధ్రా యూనివర్సిటీతో సహా రాష్ట్రంలో పలు యూనివర్సిటీలలో సిఎం జగన్మోహన్ రెడ్డికి పుట్టినరోజు అభినందనలు తెలుపుతూ ఫ్లెక్సీ బ్యానర్లతో నింపేశారు. యూనివర్సిటీలలో రాజకీయలేమిటని జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ ప్రశ్నిస్తూ ట్విట్టర్‌లో ఓ లేఖ విడుదల చేశారు. విద్యార్ధులను తయారు చేయవలసిన యూనివర్సిటీలలో వైసీపీ కార్యకర్తలని తయారుచేస్తున్నారా? అంటూ ప్రశ్నించారు. చివరికి యూనివర్సిటీ వైస్ చాన్సిలర్స్‌కి కూడా వైసీపీ నేతల్లాగా ఆలోచించడం మొదలుపెట్టారని ఈ ఫ్లెక్సీ బ్యానర్లే నిరూపిస్తున్నాయని పవన్‌ కళ్యాణ్‌ అన్నారు.

ఎందరో మహనీయులు చదువుకొన్న యూనివర్సిటీలను మీ మురికి రాజకీయాలతో కలుషితం చేస్తున్నారంటూ పవన్‌ కళ్యాణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు నెలల క్రితమే రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీ బ్యానర్లను రాష్ట్ర ప్రభుత్వమే నిషేదించి, మళ్ళీ మీ పుట్టినరోజున శుభాకాంక్షలు తెలియజేస్తూ వేలాది ప్లాస్టిక్ ఫ్లెక్సీ బ్యానర్లను ఏర్పాటు చేస్తుంటే ఎందుకు వారించలేదని పవన్‌ కళ్యాణ్‌ ప్రశ్నించారు.

అయితే ఇటువంటి ప్రశ్నలకి భయపడే స్థితిని వైసీపీ ఎప్పుడో దాటిపోయింది. ఎవరు ఎటువంటి విమర్శలు చేసినా దులుపుకొని ఎదురుదాడి చేసి వారి నోళ్ళు మూయించడమే విధానంగా వైసీపీ సాగిపోతోంది. కనుక మరో ఏడాదిన్నర పాటు ఎన్నికలొచ్చే వరకు అందరూ అన్నిటినీ భరిస్తూ ఎదురుచూడాల్సిందే. కానీ మరో 30 ఏళ్ళు సిఎంగా జగన్మోహన్ రెడ్డే ఉండాలని వైసీపీ నేతలు కోరుకొంటున్నారు!