Jagan-Modi-PawanKalyan-Chandrababuటిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో సమావేశం అవడం రాజకీయ సమావేశమే అని వైసీపీ కూడా గట్టిగా నమ్ముతోంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దీనిపై స్పందిస్తూ, “ఊతకర్ర సాయంతో నడిచే చంద్రబాబు నాయుడు ఎన్నడూ ఒంటరిగా పోటీ చేయలేరు. కానీ సిఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం ఒంటరిగానే పోటీ చేసి 175 సీట్లు గెలుచుకొంటామని ధైర్యంగా చెపుతున్నారు.

ఈ నాలుగేళ్ళలో రాష్ట్రంలోఅన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పధకాలు అందించిన ఘనత జగన్‌దే. కానీ చంద్రబాబు నాయుడుకి మా పార్టీని ఒంటరిగా ఎదుర్కొనే ధైర్యం లేక పొత్తుల కోసం ఆరాటపడుతున్నారు. కానీ టిడిపి ఏ పార్టీతో పొత్తులు పెట్టుకొన్నా వచ్చే ఎన్నికలలో మళ్ళీ గెలిచి మేమే అధికారంలోకి వస్తాము,” అని అన్నారు.

టిడిపి పొత్తులు పెట్టుకొంటే వైసీపీ నష్టపోతుందని సిఎం జగన్మోహన్ రెడ్డితో సహా ఆ పార్టీలో అందరికీ తెలుసు. అందుకే పొత్తులు పెట్టుకోవడం అంటే ‘రాజకీయ వ్యభిచారమే’ అన్నట్లు మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకొని అధికారం పంచుకోవడం నేరమే అయితే గతంలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వం, గత 9 ఏళ్ళుగా దేశాన్ని పాలిస్తున్న బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కూడా నేరం చేస్తున్నట్లే కదా?

టిడిపికి బిజెపి దగ్గర కాకుండా అడ్డుకొనేందుకు ఆ ఎన్డీయే కూటమిలో వైసీపీ చేరేందుకు సిద్దపడిందని మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి కదా?అవే నిజమైతే మరి వైసీపీ కూడా నేరం చేస్తున్నట్లే కదా?

పవన్‌ కళ్యాణ్‌ టిడిపితో చేతులు కలపకుండా అడ్డుకొనేందుకు, వైసీపీ నేతలు ఆయనను ఈసడించారు… అవమానించారు.. ఆయన గురించి చాలా అనుచితంగా, చులకనగా మాట్లాడారు. తద్వారా ఆయనను రెచ్చగొట్టేందుకు చాలా ప్రయత్నించారు. కానీ ఆయన వారి ఉచ్చులో చిక్కుకుపోవడంతో ఏమి చేయాలో పాలుపోవడం లేదు.

టిడిపి, జనసేనలు పొత్తులు పెట్టుకొంటేనే వైసీపీ నష్టపోతుందని ఆందోళన చెందుతున్న వైసీపీ నేతలకి ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో అమిత్‌ షా, జేపీ నడ్డాలు భేటీ కావడం జీర్చించుకోవడం చాలా కష్టమే. ఒకవేళ బిజెపి కోడా వారితో కలిస్తే వచ్చే ఎన్నికలలో వైసీపీ ఓటమి తప్పదు.

ఒకవేళ ఓడిపోతే, ఇంతకాలం టిడిపి, జనసేనలను వేధించినందుకు, వైసీపీలో అందరూ మూల్యం చెల్లించకతప్పదు. కనుక వచ్చే ఎన్నికలు వైసీపీకి జీవన్మరణ సమస్యవంటివే అని భావించవచ్చు. కానీ ఇంకా ఎన్నికలకు చాలా సమయం ఉంది కనుక అంతవరకు వైసీపీ నేతలు ఎన్ని మాటలైనా మాట్లాడవచ్చు.