Jagan-EEnadu-Saksh-AndhraJyothiప్రస్తుతం జరుగుతున్న ఏపీ శాసనసభ సమావేశాలలో సిఎం జగన్మోహన్ రెడ్డి అమరావతి, మూడు రాజధానులు, పరిపాలనా వికేంద్రీకరణ, పరిశ్రమలు, పెట్టుబడులు, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి వంటి వివిద అంశాలపై వివరణ ఇస్తున్నారు. తమ ప్రభుత్వ నిర్ణయాలను, విధానాలను సమర్ధించుకొంటూ సుదీర్గంగా ప్రసంగాలు చేస్తున్నారు. రాష్ట్రాభివృద్ధికి తమ ప్రభుత్వం చేస్తున్న కృషిని మీడియా కూడా గుర్తించకుండా రాజకీయ దురుదేశ్యంతో తమ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగేవిదంగా కట్టు కధనాలు, తప్పుడు రాతలు వ్రాస్తున్నాయని ఆరోపించారు.

ప్రభుత్వాన్ని గట్టిగా సమర్ధించుకొనే ప్రయత్నంలో సిఎం జగన్ వాస్తవాలను వక్రీకరించి చూపుతున్నారని, రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని సభలో టిడిపి సభ్యులు ప్రభుత్వాన్ని కడిగేస్తూనే ఉన్నారు. శాసనసభలో అధికార, ప్రతిపక్షాల మద్య జరుగుతున్న ఈ వాదోపవాదాలపై సోషల్ మీడియాలో కూడా టిడిపి, వైసీపీ అనుకూల వర్గాల మద్య పెద్ద యుద్ధమే కొనసాగుతోంది.

అయితే శాసనసభ, సోషల్ మీడియాలో విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలే తప్ప వాటిలో వాస్తవాలు ప్రజలకు తెలిసే అవకాశం ఉండదు. కనుక మళ్ళీ వాటిపై వైసీపీ ఆత్మసాక్షిలో, ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా వాటికి సంబందించి పూర్తి వివరాలతో చాలా ఆసక్తికరమైన కధనాలు వస్తున్నాయి.

అక్కడ శాసనసభలో అధికార ప్రతిపక్షాల మద్య యుద్ధం జరుగుతుంటే, బయట ఈనాడు-సాక్షి మీడియా మద్య మరో యుద్ధం జరుగుతుండటం విశేషం. నిప్పు లేనిదే పొగ రాదన్నట్లు వాస్తవాలను కప్పిపుచ్చేందుకు లేదా వక్రీకరించే ప్రయత్నంలో శాసనసభలో సిఎం జగన్, బయట సాక్షి మీడియా ఎన్ని కధలు చెపుతున్నప్పటికీ, ఈనాడు మీడియా వాటన్నిటికీ తేదీలు, గణాంకాలు, రికార్డుల కాపీలతో సహా బట్టబయలు చేస్తుండటం విశేషం.

ఉదాహరణకి మొన్న శాసనసభలో అమరావతి వలన రాష్ట్రానికి నష్టం, ప్రభుత్వానికి భారమే తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదంటూ సిఎం జగన్ వాదించారు. ఆయన చెప్పిన ప్రతీ పాయింట్‌కి ‘ఈనాడు’ తేదీలు, గణాంకాలు, రికార్డుల కాపీలతో సహా సమాధానాలు చెపుతూ ఆయన వాదనలన్నీ తప్పని నిరూపించింది. మళ్ళీ నిన్న శాసనసభలో సిఎం జగన్ పోలవరం ప్రాజెక్టు గురించి చెప్పిన విషయాలపై కూడా ఈరోజు ఈనాడు మీడియాలో వాస్తవాలను సవివరంగా తెలియజేసి, సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రే ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించింది.

ముఖ్యమంత్రి మీడియాను ఎల్లో మీడియా అంటూ ముద్రవేస్తున్నప్పటికీ ఈనాడు వంటి కొన్ని మీడియా సంస్థలు ప్రజాస్వామ్య వ్యవస్థకు నాలుగవ స్థంభంలా నిలుస్తూ వాస్తవాలను ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తుండటం చాలా అభినందనీయం. రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మళ్ళీ మళ్ళీ నష్టపోకుండా కాపాడుకోవలసిన బాధ్యత అందరిపై ఉంది కదా?

Exclusive Video Interviews: Watch & Subscribe