Jagan ED cases court exemptionతన మీద నమోదైన సిబిఐ కేసులలో వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు కోరుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. జగన్ దాఖలు చేసిన పిటీషన్ పై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. జగన్‌ అభ్యర్థనపై సీబీఐ అభ్యంతరం తెలుపుతూ కౌంటర్‌ దాఖలు చేసింది.

ఆయనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వొద్దంటూ సీబీఐ అధికారులు కౌంటర్‌లో పేర్కొన్నారు. గతంలో సిబిఐ కోర్టులో తెలిపినట్టే ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ కు అటువంటి మినహాయింపు ఇస్తే సాక్షులని ప్రభావితం చేసే అవకాశం ఉందని సిబిఐ తెలిపింది. సీబీఐ కౌంటర్‌ దాఖలు చేయడంతో తదుపరి విచారణను ఉన్నత న్యాయస్థానం ఏప్రిల్‌ 9కి వాయిదా వేసింది.

దీనితో మినహాయింపు పిటీషన్ పై రెండు నెలలు సస్పెన్స్ కొనసాగనుంది. ఇది ఇలా ఉండగా ఈ పిటీషన్ హైకోర్టులో పెండింగ్ ఉండటంతో సిబిఐ కేసుల వ్యక్తిగత హాజరు నుండి జగన్ కు మినహాయింపు దొరుకుతుంది. అయితే ఈడీ కేసులకు గాను ఆయన ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లాల్సి రావొచ్చు.

వచ్చే శుక్రవారం లోగా జగన్ ఈడీ కేసుల నుండి కూడా మినహాయింపు కావాలని హైకోర్టుని ఆశ్రయిస్తే… ఆ మేరకు ఈ రెండు పిటీషన్లపై తీర్పు వచ్చే లోగా కోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. గతంలో ఈ పిటీషన్ వేసి ఏవో సాంకేతిక సమస్యలు ఉన్నాయని మళ్ళీ విత్ డ్రా చేసుకున్నారు జగన్ తరపున లాయర్లు.