jagan Compassionate no matter how hard works‘రైట్ పర్సన్ ఇన్ రాంగ్ ప్లేస్’ – ఇది రోజా గురించి నాడు వైఎస్సార్ చేసిన వ్యాఖ్యలు. ఒకప్పుడు తెలుగుదేశంలో కీలక బాధ్యతలు చేపట్టిన రోజా, వైఎస్సార్ చేసిన ఆ వ్యాఖ్యలతో ఫిదా అయిపోయారు. స్వయంగా రోజానే పలు సందర్భాలలో ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే ఆ వెంటనే వైఎస్ కాలం చేయడం, జగన్ మరో పార్టీ పెట్టడం, జగన్ చెంతన రోజా చేరడం జరిగిపోయాయి.

ఏ పార్టీలో ఉన్నా తన వాగ్ధాటితో అధినాయకులను మెప్పించగల స్వరం రోజాది. ఆ వాక్చాతుర్యత గమనించే చంద్రబాబు మహిళా విభాగానికి అధ్యక్ష పదవిని అప్పచెప్పారు. అలాగే వైసీపీలోకి వచ్చిన తర్వాత కూడా టీడీపీపై ప్రజలను ఆకట్టుకునే విధంగా విమర్శలు చేసే రోజా వాగ్ధాటి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

పేపర్ అవసరం లేకుండా అనర్గళంగా ప్రసంగించగల రోజా, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా అరుదుగా మాట్లాడుతున్నారు. నిజానికి మంత్రి పదవి దక్కుతుందని భావించిన రోజాకు, వైసీపీ అధినేత కేవలం నామమాత్రపు పదవితో సరిపెట్టి, ముఖ్యంగా మీడియాకు దూరంగా ఉంచారు. దీంతో గత మూడేళ్లల్లో రోజా ముఖ్యమైన సందర్భాలలో మాత్రమే మీడియా ముందుకు వచ్చారు.

రెండున్నర్రేళ్ళల్లో మంత్రులను మారుస్తానని ముందే చెప్పడంతో, రెండో విడతలో అయినా మంత్రి పదవి దక్కుతుందనేది రోజా ఆకాంక్ష. అయితే కేబినెట్ విస్తరణ గురించి ఇప్పటివరకు జగన్ ఎలాంటి అడుగులు ముందుకు వేయకపోవడంతో, ప్రస్తుతం ఆశావాహులంతా ముఖ్యమంత్రిని ఆకర్షించే పనిలో ఉన్నారు.

అందులో భాగంగానే మహిళా దినోత్సవం రోజున సీఎం జగన్ ను ఫిదా చేసే విధంగా రోజా మరోసారి తెలుగుదేశం పార్టీని, నేతలను విమర్శించారు. ఒక విధంగా చెప్పాలంటే సీఎంగా జగన్ చేసిన ప్రసంగం కంటే రోజా వాక్చాతుర్యమే వైసీపీ వర్గాలను ఆకట్టుకుంది. ‘ఫైర్ బ్రాండ్’గా ముద్రపడిన రోజా ఇంతలా ప్రసంగించినా లాభం లేదన్నది అంతిమంగా వెలువడుతోన్న అభిప్రాయం.

సొంత పార్టీ నేతలే స్థానికంగా వెనుక గోతులు త్రవ్వుతున్నా, రెండు సార్లు గెలిచిన రోజాకు సరైన గుర్తింపును అందివ్వడంలో జగన్ సుముఖత చూపడం లేదనేది పొలిటికల్ వర్గాలలో వ్యక్తమవుతోన్న సమాచారం. టీడీపీని విమర్శించడానికి ఓ ఆయుధంలా రోజాను వినియోగించుకుంటున్నారు తప్ప, రోజా ఆశించే ఓ ఉన్నతమైన పదవిని మాత్రం అందించడం లేదనేది మీడియా వర్గాల చర్చ.

ఇటీవల కాలంలో పార్టీని వదిలేస్తారన్న ప్రచారం జరిగినపుడు కూడా రోజా వాటిని బలంగా తిప్పికొట్టింది. ఏది ఏమైనా తాను జగన్ తోనే ఉంటానని బల్లగుద్ది మరీ చెప్పింది. అంత విశ్వాసాన్ని కనపరిచిన నగరి ఎమ్మెల్యే, జగన్ కనికరానికి నోచుకుంటుందా? లేదా? అనేది కాలమే సమాధానం చెప్పాలి. అయితే రోజా గురించి నాటి వైఎస్సార్ ప్రస్తావించిన మాటలకు – నేడు వైఎస్ తనయుడు అనుసరిస్తున్న విధానానికి ఎక్కడా పొంతన లేదనేది పొలిటికల్ టాక్.