jagan comments about 10th and intermediate examinationsక‌రోనా వైర‌స్ వ్యాప్తి ప్ర‌మాద‌క‌రంగా ఉన్న స‌మ‌యంలో… ఏపీలో షెడ్యూల్ ప్ర‌కార‌మే ప‌ది, ఇంట‌ర్ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌ని స‌ర్కార్ చెప్ప‌టంపై తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం అవుతుంది. పరీక్షలు రద్దు చెయ్యాలని ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ పదే పదే డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈరోజు జగనన్న విద్యాదీవెన నిధుల విడుదల సందర్భంగా సీఎం జగన్ దీని మీద స్పందించారు.

“ప‌రీక్ష‌లు ర‌ద్దు చేయ‌టం చాలా సుల‌భ‌మైన ప‌ని అని, కానీ విద్యార్థ‌లు బంగారు భ‌విష్య‌త్ కోస‌మే క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకున్నాం. కేవలం సర్టిఫికెట్ల మీద పాస్ అని ఉంటే ఏం లాభం? జ‌స్ట్ పాస్ పాస్ స‌ర్టిఫికెట్ తో అప్లై చేసిన మ‌న విద్యార్థుల‌కు ఉద్యోగాలు ఉండవు. విద్యార్థుల జీవితాల కోసం నా కంటే ఎవ‌రూ ఎక్కువ ఆలోచించారు,” అని జగన్ చెప్పుకొచ్చారు.

అయితే విద్యావేత్తలు దీనితో విభేదిస్తున్నారు. “2020, 2021 సంవత్సరాలలో పెను విపత్తు సంభవించి ప్రపంచమంతా కుదేలు అయ్యిందని చరిత్రలో ఉంటుంది. ఇది ఒక పల్లె కో, జిల్లాకో వచ్చిన విపత్తు కాదు. ఉద్యోగాలు ఇచ్చే వారికి సర్టిఫికెట్ల మీద ఎందుకు మార్కులు లేవు అని తెలియకుండా ఉండదు. ముఖ్యమంత్రికి గానీ, ఆయన సలహాదారులు గానీ ఆ విషయం తెలియకపోవడం శోచనీయం,” అని వారు అంటున్నారు.

ఇది ఇలా ఉండగా… ఆంధ్రప్రదేశ్ లో మే 5 నుంచి ఇంట‌ర్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించేందుకు స‌న్నాహాలు మొదలు పెట్టారు. మ‌రో రెండ్రోజుల్లో వెబ్‌సైట్‌లో ఇంట‌ర్ హాల్‌ టిక్కెట్లు. ఏపీలో రోజుకు 10వేలకు పైగా కేసులు వస్తున్న తరుణంలో పరీక్షలు అంటే విద్యార్థులు, తల్లిదండ్రులు భయాందోళనలకు గురి అవుతున్నారు.