Jagan - Chandrababu Naiduఆంధ్రప్రదేశ్ – తెలంగాణ మధ్య నీటి యుద్ధం … అనుకున్న దాని కంటే ఎక్కువగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ ని ఇబ్బంది పెడుతుంది. ఒకవైపు తెలంగాణ మంత్రులు తమ దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ని తూలనాడుతున్నా తిరిగి ఒక్క మాట కూడా అనలేని పరిస్థితి.

ఒక పక్క కేసీఆర్ తన మంత్రులను నియంత్రించే ప్రయత్నం చెయ్యకపోయినా జగన్ ఎందుకు వెనకాడుతున్నారు అని అభిమానులకు కూడా అర్ధం కావడం లేదు. దానితో కేంద్రానికి లేఖలు రాయడంతో సరిపెడుతున్నారు. ఇటువంటి వివాదాలలో తలదూరిస్తే ఏదో ఒక రాష్ట్రంలో బీజేపీకి ఇబ్బంది వస్తుందని కేంద్రం పట్టించుకున్న దాఖలాలు లేవు.

ఈ తరుణంలో దీని నుండి ఎలా బయటపడాలో అంతుచిక్కడం లేదు వైఎస్సార్ కాంగ్రెస్ కు. తాజాగా చంద్రబాబు నాయుడు తెలంగాణ జలదోపిడి మీద ఎందుకు మాట్లాడటం లేదు అంటూ ఆ పార్టీ కొత్త పల్లవి అందుకుంది. మరోవైపు.. జగన్ ప్రధాన సలహాదారు… సజ్జల రామకృష్ణారెడ్డి రెండు రాష్ట్రాల మధ్య వివాదాలకు కొన్ని శక్తులు పనిచేస్తున్నాయనే అనుమానం ఉందని చెప్పడం విశేషం.

సహజంగా ఇటువంటి అనుమానాలు వైఎస్సార్ కాంగ్రెస్ కు చంద్రబాబు మీదే వస్తాయి. అయితే ఆయన పేరు బయటకు చెప్పినా… చంద్రబాబు కేసీఆర్ మధ్య ఉన్న శత్రుత్వం కారణంగా ప్రజలను నమ్మించడం అసంభవం. దానితో ఎటు పాలుపోని స్థితిలో ఉంది వైఎస్సార్ కాంగ్రెస్.

ఇక చంద్రబాబు మాట్లాడాలి అంటూ డిమాండ్ చెయ్యడం వల్ల కూడా పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. సాక్షాత్తు ముఖ్యమంత్రి అక్కడ మనవాళ్ళు ఉన్నారని మాట్లాడటం లేదు అని చెప్పినప్పుడు చంద్రబాబుని ఏమని అడుగుతారు?