Jagan cabinet reshuffle (2)ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేబినెట్ లోని ఇద్దరు ఎమ్మెల్సీలుగా ఉన్న మంత్రులు రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఖాళీలు ఏర్పడ్డాయి. వీటిని పూడ్చడానికి జగన్ తన కేబినెట్ లో కొద్ది పాటి మార్పులు చెయ్యబోతున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా ఉపముఖ్యమంత్రిగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ స్థానంలో ధర్మాన కృష్ణదాస్ ను తీసుకుంటారని సమాచారం.

ఆ రకంగా బీసీ కోటాని అదే బీసీ వ్యక్తితో పూడ్చినట్టు అవుతుంది. ఈ నెల 29న రాజ్యసభకు ఎన్నికైన ధర్మాన కృష్ణదాస్, మోపిదేవి వెంకటరమణలు రాజీనామా చేస్తారు. ఆ వెంటనే కొత్త వారిని జగన్ తన కేబినెట్ లోకి తీసుకుంటారని సమాచారం. అయితే ఇప్పటిదాకా ఈ విషయంగా ఆయన ఎవరితోనూ చర్చించలేదని తెలుస్తుంది.

అధికారంలోకి వచ్చాకా జగన్ చేస్తున్న మొట్టమొదటి కేబినెట్ విస్తరణ ఇది. అయితే ఈ విస్తరణలో ఉద్వాసనలు ఏవీ ఉండబోవని సమాచారం. ఇప్పటికే రెండున్నర ఏళ్ళ తరువాత దాదాపుగా మొత్తం కేబినెట్ ని మార్చి వేరే వారికి అవకాశం ఇస్తానని జగన్ ప్రకటించారు. కావున అప్పటివరకూ ఉద్వాసనలు ఉండవని అంటున్నారు.

ప్రస్తుతం కేబినెట్ నుండి తప్పుకునే ఇద్దరూ బీసీ సామాజిక వర్గానికి చెందిన వారే. ఇందులో పిల్లి సుభాష్ శెట్టిబలిజ కాగా, మోపిదేవి మత్సకార వర్గానికి చెందిన వారు. దీంతో వీరి స్ధానాల్లో మరో ఇద్దరు బీసీలకే చోటు కల్పించాలనే డిమాండ్ ఎక్కువగా వినిపిస్తోంది. కాబట్టి బీసీల్లో గౌడ సామాజిక వర్గానికి చెందిన కృష్ణాజిల్లా పెడన ఎమ్మెల్యే జోగి రమేష్, మత్సకార సామాజికవర్గానికి చెందిన తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ కు అవకాశం దక్కేలా కనిపిస్తోంది. వీరితో పాటు కృష్ణాజిల్లా పెనమలూరు సీటు నుంచి గెలిచిన మాజీ మంత్రి పార్ధసారధి పేరు కూడా వినిపిస్తోంది.