Jagan BJP Somuveerrrajuదుబ్బాక, జీహెచ్ఎంసి ఎన్నికలలో తెలంగాణ బీజేపీ సత్తా చాటడంతో ఆంధ్రప్రదేశ్ బీజేపీ కూడా తమ ఉనికిని చాటుకోవడానికి తిరుపతి ఉపఎన్నిక సందర్భంగా విశ్వప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే ఆ పార్టీ రాష్ట్ర నేతలు తిరుపతిలో మకాం వేసి తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.

తిరుపతి ఉపఎన్నిక నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్, బీజేపీలు ఒకరికొకరు సహకరించుకుంటాయా అని చర్చ నడుస్తుంది. తిరుపతిలో తమకు సహకరించి తమకు రెండో స్థానం రాబడితే అది తెలుగుదేశం పార్టీకి కోలుకోలేని దెబ్బ అని… ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని బీజేపీ వైఎస్సార్ కాంగ్రెస్ కు వర్తమానం పంపిందని సమాచారం.

అయితే దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉందని సమాచారం. తెలుగుదేశం బలహీనపడిందని… ఇప్పుడు కాకపోతే ఇంకోసారైనా అది తెరమరుగు అవుతుందని… ఇటువంటి సమయంలో బీజేపీకి సహకరించి ఆ పార్టీని పెంచి పోషించడం అవసరమా అని అనుకుంటున్నారట.

దీనితో జగన్ ఈ ప్రతిపాదనపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. వైఎస్సార్ కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ అకాలమరణంతో తిరుపతిలో ఉపఎన్నిక అనివార్యం అయ్యింది. ఆయన కుటుంబసభ్యులకు సీటు ఇవ్వకపోయినా తమకు మూడు లక్షల మెజారిటీ ఖాయమని అధికారపక్షం ధీమాగా ఉంది.