వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పధకాల కోసం దొరికిన చోటల్లా ఎడాపెడా అప్పులు చేస్తున్న సంగతి తెలిసిందే. అప్పులు చేశాక వాటిని అసలు, వడ్డీలతో సహా చెల్లించక తప్పదు. కనుక నానాటికీ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దయనీయంగా మారుతోంది. రాష్ట్ర ప్రభుత్వం చివరికి ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులకి నెలనెలా సకాలంలో జీతాలు చెల్లించలేని దుస్థితికి చేరుకొంది. అంతే కాదు… ప్రభుత్వం తమ జీపీఎఫ్ ఖాతాలలో డబ్బుని కూడా వాడేసుకొందని ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అద్భుతంగా ఉందని, ఏపీ వృద్ధి రేటు మహాద్భుతంగా ఉందని రాష్ట్ర ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వాదిస్తున్నారు. నేడో రేపో బడ్జెట్‌లో కూడా ఇదే చెప్పబోతున్నారు.
టిడిపి ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ఏపీ అప్పుల గురించి రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకి కేంద్ర ఆర్ధికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. దానిలో ఏపీ ఆర్ధిక పరిస్థితి చాలా దయనీయంగా ఉందని తెలియజేశారు.
తాజా లెక్కల ప్రకారం ఏపీ అప్పులు రూ.4,42,442 కోట్లకి చేరుకొందని లిఖితపూర్వకంగా తెలియజేశారు. 2019 సం.లో రూ.2,64,451 కోట్లు ఉండగా అది మరుసటి సంవత్సరానికి రూ.3,07,671 కోట్లకి పెరిగిందని తెలిపారు. అది 2021 నాటికి రూ.3,53,021 కోట్లు, 2022 నాటికి రూ.3,93,718 కోట్లకి పెరిగిందని తెలియజేశారు.
అంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రూ.43,220 కోట్లు, రెండో సం.లో మరో రూ.45,350 కోట్లు, మూడో సం.లో రూ.40,697 కోట్లు, ఈ ఏడాది మార్చిలో బడ్జెట్‌లో ప్రవేశపెట్టేనాటికి మరో రూ.48,724 కోట్లు అప్పు పెరిగిందన్న మాట! ఈ బడ్జెట్ అప్పులు కాక కార్పొరేషన్ల పేరుతో చేస్తున్న అప్పులు అదనమని కేంద్ర ఆర్ధికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి తెలియజేశారు.
గత ఏడాది ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ వరకు అప్పులు, వివిద కాంట్రాక్ పనులకి చెల్లించాల్సిన బిల్లుల బకాయిలు కలిపి రూ.1,04,000 కోట్లు అని తెలియజేశారు.
ఈ ఏడాదిలో జనవరిలో రూ.7,000 కోట్లు, ఫిభ్రవరిలో రూ.4,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసింది. మార్చి నెలలో మరో రూ. 1,000 కోట్లు అప్పు చేసేందుకు సిద్దం అవుతోంది. అంటే మొదటి మూడు నెలల్లోనే వైసీపీ ప్రభుత్వం రూ.12,000 కోట్లు అప్పులు చేసిందన్న మాట! ఏడాదికి సగటున రూ.45,000 కోట్లు చొప్పున అప్పులు చేస్తున్నా రాష్ట్రంలో రోడ్ల గుంతలు కూడా పూడ్చలేకపోతోందని ప్రతిపక్షాలు వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తుండటం అందరూ వింటూనే ఉన్నారు.