Jagan_Andhra_Pradesh_Loansఆంద్రులు గర్వంగా చెప్పుకోవలసిన ఏపీ రాజధాని వివాదస్పదంగా మార్చేసింది వైసీపీ ప్రభుత్వం. మళ్ళీ ఏపీ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి దాదాపు 9 సంవత్సరాలు కావస్తోంది. ఇంకా ప్రభుత్వానికి, ప్రజలకి కూడా ఏపీ రాజధాని ఎక్కడో తెలీదు! ఇంకా ఎప్పుడు ఎక్కడ ఏర్పాటవుతుందో కూడా చెప్పలేని దుస్థితి!

ఈ దుస్థితికి కల్పించింది ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వమే అని చెప్పక తప్పదు. ఆనాడు టిడిపి ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఖరారు చేసినప్పుడే వైసీపీ తన అభిప్రాయాన్ని తెలియజేసి, గట్టిగా వ్యతిరేకించి ఉండి ఉంటే నేడు ఇంత అనర్ధం జరిగి ఉండేదే కాదు. కానీ అప్పుడు వ్యతిరేకించి ఉంటే ఏపీలో వైసీపీ అధికారంలో రాలేదు. కనుక అమరావతే మన రాజధానిగా ఉంటుందని ప్రజలని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చింది!

ఆ తర్వాత మూడు రాజధానులంటూ రాయలసీమ, ఉత్తరాంద్ర ప్రజలని మభ్యపెడుతూ సభలు, ర్యాలీలు నిర్వహిస్తూ ప్రాంతీయ విభేధాలు సృష్టించేందుకు వెనుకాడలేదు. అయితే మూడు రాజధానుల ప్రతిపాదన దేనికంటే ఆంధ్రా అభివృద్ధి కోసం కానే కాదని అందరికీ తెలుసు. ఈ వంకతో రాయలసీమ, ఉత్తరాంద్రలో టిడిపి, జనసేనలని తిరగనీయకుండా చేసి వాటిని రాజకీయంగా దెబ్బ తీసేందుకే అని వైసీపీ నేతల మాటలతోనే బయటపడింది కదా?

మూడు రాజధానుల విషయంలో ప్రజలనే కాకుండా ఇప్పుడు పెట్టుబడిదారులని కూడా మభ్యపెట్టేందుకు ప్రయత్నించారు రాష్ట్ర ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. మూడు రాజధానులనేది కేవలం ‘మిస్ కమ్యూనికేషన్’ అని విశాఖ ఒక్కటే రాజధానిగా ఉంటుందని చెప్పారు. కర్నూలులో హైకోర్టు బెంచ్, గుంటూరులో మొక్కుబడిగా ఒక సెషన్ శాసనసభ సమావేశాలు నిర్వహిస్తామని చెప్పడం ద్వారా మూడు రాజధానుల కాన్సెప్ట్ బయటపెట్టేశారు.

పెట్టుబడిదారులని ఆకట్టుకొనేందుకు విశాఖ ఒక్కటే ఏపీకి రాజధానిగా ఉంటుందని చెప్పేశారు. కానీ ఆ ప్రయత్నంలో అమరావతి, కర్నూలు ప్రజలకి హ్యాండ్ ఇవ్వబోతున్నట్లు బయటపెట్టేశారు. దీనిపై రాయలసీమ, అమరావతి ప్రజలు అప్పుడే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనుక మూడు రాజధానుల పేరుతో ప్రతిపక్షాల కోసం తవ్విన గోతిలో వైసీపీయే పడబోతోందని అర్దం అవుతోంది.

రాజధానికి పెట్టుబడులకి ఎటువంటి సంబందమూ లేదని నిన్ననే ఏపీ సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ చెప్పారు. కానీ ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బెంగళూరులో జరిగిన పెట్టుబడిదారుల సమావేశంలో రాజధాని గురించే మాట్లాడారు దేనికి?

అయినా ప్రజలనే ఇంతగా మభ్యపెడుతున్న వైసీపీ ప్రభుత్వం మాటలు నమ్మి ఏపీలో ఏ పారిశ్రామికవేత్త అయినా పెట్టుబడులు పెడతాడా?ఒకవేళ వైసీపీ మాయలో పడి పెట్టేందుకు సిద్దపడినా రేపు ప్రభుత్వం మారితే మళ్ళీ అమరావతి రాజధాని అవుతుంది కదా?అప్పుడు వారి పరిస్థితి ఏమిటి?అనే ప్రశ్నలకి వైసీపీ నేతలే సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది.

అయినా మూడు రాజధానుల కధని ఇంకా ఎన్నేళ్ళు సాగదీస్తారు? దాంతో ఇంకా ఎంతమందిని మభ్యపెడతారు?చివరికి ఈ మూడు రాజధానుల కాన్సెప్ట్ తమ కొంపముంచుతుందని వైసీపీ నేతలు ఇప్పటికైనా గ్రహించారో లేదో?