YS-Jagan-Amaravati-Three-Capitalsఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు తమ రాష్ట్రానికి రాజధాని ఏదో చెప్పుకోలేని దుస్థితి కల్పించిన వైసీపీ ప్రభుత్వం, నేడో రేపో విశాఖను రాజధాని చేసేయబోతున్నట్లు హడావుడి చేస్తుండటం చూస్తే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. వారి హడావుడి రాజధాని కోసమే అయితే సంతోషమే కానీ ఆ పేరుతో ఉత్తరాంద్రలో ముఖ్యంగా విశాఖ జిల్లాలో టిడిపిని రాజకీయంగా చావుదెబ్బ తీయాలనే ఆత్రమే ఎక్కువగా కనిపిస్తోంది. వైసీపీ మంత్రుల మాటలలోనే అది అర్దం అవుతోంది.

అయితే గత ఎన్నికలకు ముందు వారి అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఏమని చెప్పారో మరిచిపోయి ఉండవచ్చు. కానీ మీడియా వారి చరిత్రని అక్షర రూపంలో, వీడియోల రూపంలో నిక్షిప్తం చేసే ఉంచుతుంది.

ఈరోజు ఈనాడులో ‘రాజధానిపై జగన్నాటకం’ అనే పేరుతో ఒక ఆర్టికల్ ప్రచురించింది. వాటిలో జగన్మోహన్ రెడ్డి ఆనాడు ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రజలకు ఏమి చెప్పారు? ఈరోజు నాలిక మడతేసి ఏం చెపుతున్నారో తేదీలతో సహా ప్రచురించింది.

వాటిలో జగన్ స్వయంగా వివిద సందర్భాలలో చెప్పిన మాటలు ఇవి:

2014 (అసెంబ్లీ సమావేశాలలో): ప్రాంతాల మద్య చిచ్చుపెట్టడం ఇష్టం లేకనే విజయవాడను రాజధానిగా నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను.

2014, ఏప్రిల్ 13: మేము అధికారంలోకి వస్తే కేంద్రం సహకరించినా సహకరించకపోయినా హైదరాబాద్‌ను తలదన్నేలా రాజధాని నగరం నిర్మిస్తాం. ఇది మా రాజధాని అని రాష్ట్రంలో ప్రతీ ఒక్కరూ గర్వంగా చెప్పుకొనేలా అంతర్జాతీయ స్థాయిలో రాజధాని నగరాన్ని నిర్మిస్తాం. దానిలో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలు ఏర్పాటు చేయిస్తాం. అలాంటి రాజధాని లేకపోతే రాష్ట్రానికి భవిష్యత్‌ ఉండదు. యువత రాష్ట్రంలో ఉండటానికి ఇష్టపడదు.

2014, జూలై 23: రాజధాని రాష్ట్రానికి నడిబొడ్డున ఉంటేనే అందరికీ అందుబాటులో ఉంటుంది. రాజధానికి కనీసం 25-30 వేల ఎకరాలు, పుష్కలంగా మంచినీటి వసతి ఉండటం చాలా అవసరం. ఎటువైపు నుంచి చూసినా రాజధాని 12కిమీ విస్తీర్ణం ఉండాలి.

2017, జూలై 9: జగన్ అధికారంలోకి వస్తే అమరావతిలో రాజధాని ఉండదని, వేరే చోటికి మార్చేస్తాడని చంద్రబాబు నాయుడు పదేపదే ఆరోపిస్తున్నారు. అందుకే నేను ఈ రాజధాని ప్రాంతంలోనే ఈ ప్లీనరీ ఏర్పాటు చేసి ఇదే వేదికపై నుంచి చంద్రబాబు నాయుడుకి అర్దం అయ్యేందుకు ‘విజయవాడా…’తో నా ప్రసంగం మొదలుపెట్టి ‘గుంటూరూ..’ తో నా ప్రసంగం ముగిస్తున్నాను.

2017, జూలై 19: జగన్ అనే వ్యక్తి ఇక్కడ రాజధానిలోనే తన ఇల్లు, పార్టీ కార్యాలయం నిర్మించుకొని ఫిబ్రవరిలో గృహాప్రవేశం చేయబోతున్నాడు. అయినా జగన్ మభ్యపెడుతున్నాడని చంద్రబాబు నాయుడు ఆరోపిస్తుండటం దురదృష్టకరం.

2019, డిసెంబర్‌ 17: (ఎన్నికలలో వైసీపీ గెలిచిన తర్వాత శాసనసభలో మూడు రాజధానులు ప్రతిపాదన): దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కి మాత్రం ఎందుకు ఉండకూడదు? వికేంద్రీకరణ కొరకే మూడు రాజధానులు అవసరమని చెపుతున్నాం. కొత్త రాజధాని (అమరావతి)ని నిర్మించాలంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి?అదే… విశాఖలో రాజధాని పెట్టుకొంటే అక్కడ అన్నీ సిద్దంగా ఉన్నాయి. ఓ మెట్రో రైలు వేసుకుంటే సరిపోతుంది.

2022, సెప్టెంబర్‌ 15: (అసెంబ్లీలో జగన్ ప్రసంగం) అభివృద్ధి వికేంద్రీకరణ మా విధానం. వికేంద్రీకరణ మంచి ఫలితాలు కనిపిస్తున్నప్పటికీ టిడిపి నేతలు మూడు రాజధానుల గురించి దుష్ప్రచారం చేస్తూ ప్రజల భావోద్వేగాలు రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తున్నారు. అమరావతి నిర్మించాలంటే రూ.1.10 లక్షల కోట్లు కావాలి. మున్ముందు ధరలు పెరిగే కొద్దీ అది రూ.30 లక్షల కోట్లవుతుంది. అంత డబ్బు తెచ్చి రాజధాని కట్టాలంటే మరో వందేళ్లు పడుతుంది. అందుకే దానిలో 10 శాతం అంటే రూ.10వేల కోట్లు ఖర్చు చేస్తే చాలు… విశాఖలో రాజధానిని ఎక్కడికో తీసుకుపోవచ్చు. ప్రస్తుత పరిస్థితులలో అమరావతిని నిర్మించలేము. కానీ పరిస్థితులు అర్దం చేసుకోకుండా ఇక్కడే రాజధాని నిర్మించాలంటూ టిడిపి నేతలు డ్యాన్సులు, డ్రామాలు ఆడుతున్నారు.