jagan about attacks on tdp officiesరాష్ట్రంలో నిన్న కనీవినీ ఎరుగని విధంగా ప్రతిపక్ష పార్టీకి చెందిన ఆఫీసుల మీద ఒక్కసారిగా దాడులు జరిగాయి. ఆ దాడులతో తమ పార్టీకి సంబంధం లేదు గానీ జగన్ మీద టీడీపీ వాడుతున్న భాషకు బదులుగా తమ అభిమానులు చేసి ఉండొచ్చని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.

అప్పటి నుండీ మంత్రులు అంతా రాజకీయాలలో విలువలు, అర్ధవంతమైన భాష గురించి మీడియా ముందుకు వచ్చి ఉపన్యాసాలు ఇస్తున్నారు. దానిపై ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక బూతులు తిడుతున్నారని.. ఎవరూ మాట్లాడని.. ఎప్పడూ వినలేని దారుణమైన బూతులు తిడుతున్నారని చెప్పుకొచ్చారు.

ఆ బూతులు వినలేక.. తన అభిమానులు..ఆప్యాయత చూపించే వారి నుంచి వారు తట్టుకోలేక వారిలో రియాక్షన్ కనిపిస్తుందని చెప్పారు. ప్రజల మధ్య వైషమ్యాలు క్రియేట్ చేసి అలజడికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మతాలు – కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.

సరే నిన్న రాష్ట్రంలో జరిగిన విద్వాంసం ఎవరన్నా చేయించినా, ఎవరి కోసం చేసినా అది వైఎస్సార్ కాంగ్రెస్ కు చెందిన వారి పనే అని సీఎం నుండి మంత్రుల దాకా ఒప్పుకున్నారు. అయితే ఒక రాష్ట్రంలో పట్టపగలు ఫ్యాక్షన్ తరహా లో దాడులకు తెగబడితే ముందుగా పలచన అయ్యేది ఆ రాష్ట్రం, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి.

కాకపోతే రాజకీయ అవసరాల కోసం అటువంటి చర్యలను తప్పు పట్టలేకపోవచ్చు. కనీసం వారిని నియంత్రించే ప్రయత్నం చెయ్యకపోవడం సంగతి అటుంచితే… కనీసం మీడియా ముందైనా నియంత్రణ కోల్పోవద్దని తమ శ్రేణులకు ముఖ్యమంత్రి చెప్పకపోవడం దారుణం. కొన్ని రోజుల క్రితం చంద్రబాబు ఇంటి మీదకు కూడా ఇలాగే గుంపు వెళ్ళింది. మళ్ళీ ఇప్పుడు అలాగే జరిగింది అంటే… ఇటువంటి బిహేవియర్ కు ప్రభుత్వం నుండి మద్దతు ఉందనుకునే ప్రమాదం ఉంది.

దాడులను కూడా వారు తన పై చూపించే ప్రేమ అనుకుని సర్దుకుపోతే రాష్ట్రం ఇమేజ్, జగన్ ఇమేజ్ దెబ్బతింటాయి.

అది కూడా ఆలోచించుకుంటే మంచిది!