What Is the Credibility, Mr. IYR Krishna Raoసోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేక ప్రచారం నిర్వహిస్తూ… పరోక్షంగా ప్రతిపక్ష పార్టీ జగన్ కు మద్దతు పలికిన ఆంధ్రప్రదేశ్‌ బ్రాహ్మణ సంఘం కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు, ప్రతిపక్ష నాయకుడి బాటలోనే పయనిస్తుండడం అత్యంత ఆసక్తికరమైన అంశం. రాష్ట్రంలో ఏది జరిగినా… చంద్రబాబు ప్రభుత్వంపై గవర్నర్ కు ఫిర్యాదు చేస్తానని చెప్తూ… రాజ్ భవన్ కు పరుగులు పెట్టడం గత మూడేళ్ళ నుండి జగన్ అనుసరిస్తున్న రొటీన్ రాజకీయ దినచర్య.

సరిగ్గా ఇదే ఫార్ములాను ఐవైఆర్ కూడా అనుసరించడం అనేది కాస్త విడ్డూరంగానే ఉంది గానీ, రాజకీయాలలో ఎవరినీ నమ్మడానికి తావు లేదని ఇలాంటి సంఘటనలు తెలియజేస్తున్నాయి. సోషల్ మీడియాలో తాను చేసిన పోస్ట్ లు తదితర అంశాల గురించి గవర్నర్ నరసింహన్ ను కలిసి వివరించారు. ఏపీ సర్కార్ తనను వివరణ కూడా అడగకుండా ఏ విధంగా తొలగించిందని ఫిర్యాదు చేస్తూ… ప్రస్తుతం తనపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్ట్ లను పెడుతున్నారని తెలిపినట్లుగా సమాచారం.

జగన్ మాదిరే ఐవైఆర్ కూడా తన ఫిర్యాదుల చిట్టాను పట్టుకుని గవర్నర్ వద్దకు వెళ్లి విన్నవించుకోవడం వలన కలిగిన ప్రయోజనం ఏమిటి అంటే… ప్రశ్నార్ధకమే గానీ, ఈ సందర్భంగా ఐవైఆర్ బ్యాక్ గ్రౌండ్ లో ఎవరు ఉన్నది అన్న విషయం మరోసారి రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. ఐవైఆర్ ను వెనకుండి నడిపిస్తున్నది జగన్ అని టిడిపి వర్గాలు చేస్తున్న ఆరోపణలకు, రాజ్ భవన్ దిశగా ఐవైఆర్ వేసిన అడుగులు మరింత బలాన్నిచ్చాయి.