IYR Krishna Rao warns - YS Jagan governmentమాజీ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ కు అనుకూలంగా వ్యవహరించి అప్పటి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టారు. తెలుగుదేశం పార్టీ ఘోరపరాజయంలో ఆయన కూడా అంతో ఇంతో పాత్ర పోషించారు. ఆ విధంగా సాయం చేసిన వారందరికీ జగన్ ఏదో ఒకటి కట్టబెట్టి ఋణం తీర్చుకున్నారు.

అయితే ఐవైఆర్ కృష్ణారావు విషయంలో మాత్రం అది జరగలేదు. అటు టీడీపీ మీద ఉన్న ద్వేషంతో ఎక్కువగా కాకపోయినా ఐవైఆర్ కృష్ణారావు అప్పుడప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ మీద స్వల్ప విమర్శలు చేస్తూ ఉంటారు. తాజాగా ఆయన రాష్ట్రప్రభుత్వానికి మరో సుతిమెత్తని హెచ్చరిక చేశారు.

“ఈ నెల పెన్షన్ ఒక వారం తర్వాత ఈ రోజు వచ్చింది. జీతాలు, పెన్షన్లు, వడ్డీ చెల్లింపులు, బడ్జెట్లో మొదటి కేటాయింపులు కాబట్టి ఒకరోజు అటు ఇటు గా చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఒక వారం పెన్షన్ చెల్లింపులు వాయిదా పడ్డాయి అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత అర్ధాన్నం గా ఉన్నది అర్థమవుతున్నది. ఆదాయానికి పొంతన లేని వ్యయంతో ముందుకు పోయే ఏ రాష్ట్ర ప్రభుత్వానికి అయినా ఇటువంటి భంగపాటు తప్పదు. ఒక నాలుగు రోజులు ముందా వెనక అంతే,” అని ఆయన ట్వీట్ చేసారు.

ఐవైఆర్ చెప్పినదాంట్లో కొత్తది ఏమీ లేకపోయినా… ఒక మాజీ చీఫ్ సెక్రటరీ చెబుతున్నారు కాబట్టి జగన్ వింటారేమో చూడాలి. అధికారంలోకి వచ్చి ఒక్క ఏడాది మాత్రమే అయ్యింది. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే మునుముందు ఇంకా కష్టతరంగా మారొచ్చు. ప్రభుత్వం ఎంత త్వరగా తెలుసుకుని తన వైఖరి మార్చుకుంటే అంత మంచిది.