IYR Krishna Rao reacts to harish rao comments on andhra pradeshమాజీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు ఒక్కోసారి బీజేపీలో ఉన్నారో వైఎస్సార్ కాంగ్రెస్ లో ఉన్నారో చెప్పడం కూడా కష్టం. అలా ఆయన ప్రవర్తిస్తూ ఉంటారు. తాజాగా ఆయన ఆంధ్రప్రదేశ్ లోని పాలనను పరిస్థితులను అవహేళన చేసిన తెలంగాణ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై స్పందించారు.

“హైదరాబాద్ ను పోగుడుకొండి, అంతే గాని ఆంధ్రప్రదేశ్ మీద హాస్యం వద్దు. 2014 లో వైజాగ్ రాజధాని అయ్యి వుంటే ఈపాటికి హైదరాబాద్ ధీటుగా వుండేది, ఇప్పుడు కూడా మరో అయిదు ఏళ్లలో ఆంధ్రా సత్తా చాటుతాం,” అంటూ చెప్పుకొచ్చారు. ఒకపక్క ఆంధ్రప్రదేశ్ బీజేపీ అమరావతిని మార్చడాన్ని వ్యతిరేకిస్తుంటే ఐవైఆర్ కృష్ణారావు వైఎస్సార్ కాంగ్రెస్ పాట పాడటం గమనార్హం.

పనిలో పనిగా తనకు ఎంతో ఇష్టమైన చంద్రబాబు నాయుడుని ద్వేషించే ఎజెండాని కూడా పూర్తి చేసుకున్నారు. మరి ఇలా జగన్ ప్రభుత్వానికి వంతపాడుతూ ఎంత కాలం బీజేపీలో ఇమడగలరో చూడాలి చూడాలి. ఇది ఇలా ఉండగా మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ సుజనా చౌదరి రాజధానిలో నిరసన తెలుపుతున్న రైతులను కలిసి తాము అమరావతి మార్పుని ఒప్పుకోబోము అని చెప్పుకొచ్చారు.

“రాజధాని రైతులారా, ఇది మీ ఒక్కరి సమస్య కాదు. ఇది రాష్ట్ర సమస్య. ఆధైర్య పడొద్దు. తాడిని తన్నేవాడు ఇక్కడ ఉంటే… తలను తన్నేవాడు ఢిల్లీలో ఉన్నాడు. చూస్తూ ఊరుకోం,” అంటూ ఆయన ప్రకటించడం విశేషం. రాజధాని ఎక్కడుండాలో నిర్ణయించుకునేది రాష్ట్ర ప్రభుత్వమే అయినా కేంద్రానికీ కొన్ని హక్కులుంటాయని ఆయన పేర్కొన్నారు.